Jump to content

పుట:పాలస్తీనా-నార్ల-వెంకటేశ్వరరావు.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

టర్కీ నిరుంకుశ పరిపాలన క్రింద పాలస్తీనాతోపాటు తక్కిన అరేబియా అంతా కూడా అతి హైన్యస్థితిని అనుభవించవలసి వచ్చింది. దాన్ని భరించలేక అరబ్బు జాతి నాయకులు విప్లవ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు 1910 తర్వాతగాని ఒక రూపానికి రాలేదు.

1911 లోనో, 12లోనో మెసపటోమియాకు స్వాతంత్య్రాన్ని సంపాయించాలని బాగ్డాడ్​లోని ఇరాక్ సైనికోద్యోగులు ఒక రహస్య సంఘాన్ని స్థాపించారు. సిరియా స్వాతంత్య్రం కోసం డమాస్కస్​లో ఇంకొక రహస్య సంఘం ఏర్పడింది. మక్కా గ్రాండ్ షెరీఫ్ అయిన హుస్సేన్ -ఇతడు మహమ్మద్ ప్రవక్త వంశీయుడు- అరేబియానంతటినీ తన ఆధిపత్యం క్రింద స్వతంత్ర రాజ్యంగా చెయ్యాలని కలలు కనసాగాడు. నెజ్డ్ ఎడారులలో ఇబిన్ సాద్ తలయెత్తి, వాహబీ స్వాతంత్య్రోద్యమానికి నాయకుడయ్యాడు. మొత్తం మీద అరబ్బు జాతి అంతా కూడా టర్కీ దాస్యశృంఖలాల నుంచి తప్పించుకోవాలని తహతహలాడ సాగింది.

సరిగా ఈ సమయంలో ఐరోపా మహాసంగ్రామం (1914) ప్రారంభమైంది. ఈ మహా సంగ్రామంలో టర్కీ జర్మనీ పక్షాన్ని వహించింది. ఇది అరబ్బులకు చక్కని అవకాశంగా కనబడింది.

బ్రిటన్, ఫ్రాన్సు మొదలైన మిత్రమండలి రాజ్యాల పక్షాన చేరి, వాటి సహాయంతో విప్లవాన్ని ప్రకటించి, టర్కీదాస్యాన్ని వదుల్చుకుంటే, స్వరాజ్యాన్ని సంపాయించుకుంటే, ఈ ఆశ, ఈ కల అరబ్ జాతినంతటినీ ఆయుధ ధారణకు పురికొల్పింది.

అరబ్బుల దాస్య బాధను-వారి స్వరాజ్యాకాంక్షను-స్వప్రయోజనానికి వినియోగంచుకోవాలని మిత్రమండలి రాజ్యాల వారు మొదటి నుంచీ అనుకుంటూనే ఉన్నారు. అరబ్బులందరి చేత తిరుగుబాటు చేయిస్తే అది టర్కీ సామ్రాజ్యం వెన్నున పొడిచినట్టవుతుంది. ఇంతటి సదవకాశాన్ని చేయిజారిపోనివ్వడమే!

టర్కీ సూయజ్ కాల్వకు సమీపంలో ఉన్న రాజ్యం. అది ఆ కాల్వ మీద దండెత్తితే, దాన్ని జయిస్తే, బ్రిటన్ - ఫ్రాన్సుల ఆటకట్టినట్టే![1] అంచేత ఎంత త్వరగా టర్కీని దెబ్బకొడితే, అంత మేలు.

ఈ ఆలోచనతో బ్రిటిషువారు ఈజిప్టులో తమ హైకమిషనర్​గా ఉంటున్న సర్ హెన్రీ మాక్-మహొన్​ను అరబ్బు జాతీయ నాయకులతో రహస్య రాయబారాల్ని సాగించవలసిందిగ ఆజ్ఞాపించారు. ఈ ఆజ్ఞ ప్రకారం అతడు మక్కాలోని షెరీఫ్ హుస్సేన్​తో ఉత్తర ప్రత్యుత్తరాల్ని నడిపాడు.

  1. 1914-1916 సంవత్సరాల మధ్య టర్కీ సేనలు రెండు సార్లు సూయజ్ కాల్వ మీద దండెత్తినాయి.