1
స్వాతంత్య్ర ప్రేమకూ, సామ్రాజ్య తత్వానికీ... జాతీయతకూ, జాత్యహంకారానికీ... ధర్మానికీ, అధర్మానికీ- ప్రస్తుతం మూడు దేశాలలో బహిరంగ సంఘర్షణ... భయానక యుద్ధం... జరుగుతున్నది. ఆ మూడు దేశాలు ఇవి: చీనా, స్పెయిన్, పాలస్తీనా.
చీనా మహారాజ్యాన్ని కబళించి, ఆసియా ఖండం మీద ఆధిపత్యాన్ని సంపాయించాలని చూస్తున్నది- జపాను.ఈ దుష్ప్రయత్నాన్ని ప్రతిఘటించడానికి అఖండమైన త్యాగాన్ని చేస్తున్నారు,- చీనావారు.
స్పెయిన్ దేశాన్ని సామంత రాజ్యంగా చేసుకుని, మెడిటరేనియన్ ప్రాంతంలో అప్రతిహతంగా విలసిల్లాలని ఆశిస్తున్నది,- ఇటాలియన్ ఫేసిస్టు ప్రభుత్వం. "విజయమో వీరస్వర్గమో" అనే మహాదీక్షతో స్వీయ స్వాతంత్య్ర రక్షణ కోసం పోరాడుతున్నారు,- స్పెయిన్ ప్రజలు.
సరిగా ఇదేవిధంగా... ఇవే పరిస్థితులలో... పాలస్తీనా అరబ్బులు బ్రిటీష్ ఇంపీరియలిజంతో సంఘర్షిస్తున్నారు.
చీనాలో జపానువారు చూపుతున్న రాక్షసత్వానికిగాని, స్పెయిన్లో ఫేసిస్టులు ప్రదర్శిస్తున్న అమానుషత్వానికిగాని, పాలస్తీనాలో బ్రిటిష్ ఇంపీరియలిస్టులు అవలంబిస్తున్న విధానం తీసిపోదు. అయితే, చీనా -- స్పెయిన్ దేశాలలో జరుగుతున్న ఘోరకృత్యాల్ని గురించి మనకు వార్తలు వస్తూ ఉంటాయి. పాలస్తీనాను గురించి మాత్రం యథార్థమైన సంగతులు తెలియవు. ఇందుకు ముఖ్య కారణం,- మనకు విదేశ వార్తల్ని పంపించే రాయిటర్ న్యూస్ ఏజెన్సీ. ఈ సంస్థకు బ్రిటిష్ ప్రభుత్వం వారి ధన సహాయం ఉంది. పైగా, దీనికి యూదు జాతివారి పట్ల అభిమానం హెచ్చు. అసలు దీని సంస్థాపకుడే యూదు జాతివాడు. అందువల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి కళంకాన్ని తెచ్చే సంఘటనల్నీ- పాలస్తీనా అరబ్బులకు అనుకూలమైన వార్తల్ని- ఈ సంస్థ కప్పి పుచ్చుతున్నది.
"అరబ్బు దుండగీళ్ళు ఈనాడు ఫలానాచోట అల్లరి చేశారు."
"అరబ్బు బందిపోటు దొంగలు నిన్నను ఫలానా బ్యాంకును దోచుకున్నారు."
"అరబ్బు హంతకులు నేటి ఉదయం ఫలానా బస్తీలో యూదుల్ని చిత్రవధ చేశారు".
రాయిటర్ పాలస్తీనానుగురించి పంపించే వార్తల ధోరణి ఇదే! ఈ వార్తల్ని చదువుతూ ఉంటే మానవాధములైనవారు ఎవరో కొందరు దౌర్జన్యాలను చేస్తూ, ప్రజల ప్రాణ మానవిత్తాల్ని హరిస్తూ ఉన్నట్టు తోస్తుంది; ధర్మయుతమైన ప్రభుత్వం మీద పితూరీ చేస్తున్నట్టు కనపడుతుంది. కాని, న్యాయానికి పాలస్తీనాలో జరుగుతున్నది పితూరీ కాదు; స్వాతంత్య్ర సమరం. దానిలో పాల్గొంటున్నవారు దుండగీళ్ళుగాని, బందిపోటు దొంగలుగాని, హంతకులుగాని కాదు; జాతీయాభిమాన పూరితులైన వీరశేఖరులు.