పుట:పంచతంత్రి (భానుకవి).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరమణీరమణపదాం
భోరుహవిన్యస్తహృదయ! భూరికృపావి
స్తారదృగంచల! లక్ష్మీ
నారాయణ! భోగవిజితనాకపమూర్తీ!

1


వ.

సుహృల్లాభంబను ద్వితీయతంత్రం బాకర్ణింపుము.

2


క.

అనినఁ గుమారులు హృదయం
బునఁ బొంగుచు విష్ణుశర్మ ముఖపంకజమున్
గనుగొని యాకథ దెలియన్
వినిపింపుము మాకు మిగులవేడుక యయ్యెన్.

3


వ.

అనిన నమ్మహాత్ముం డిట్లను, మున్ను మీకు నేనెఱింగించిన
మహిళారూప్యంబను పురసమీపమ్మున నొక్కశాల్మలీభూరుహమ్ము
గలదు. అది కుసుమవిసరద్యుతిచేత నకాలసంధ్యారాగవిభ్రమంబును
బహుళతరసాంద్రవర్ణనిబిడచ్ఛాయవలన బహుళపక్షతమస్సదృశ
ప్రభావంబునుం జేయుచు నఖిలపతంగరుతంబుల బధిరీభూతరోదోంత
రాళంబై యంతరిక్షంబున కాధారంబుగా నంబుజసంభవుండు నిలిపిన దీర్ఘ
స్తంభంబనం బొలుపొందు [నా]వృక్షంబున..............లఘుపతనకుండను
వాయసప్రభుండు వసియించియుండు నంత.

4


క.

ఒకనాఁటిఱేపకడ లు
బ్ధకుఁ డొకఁ డట కేఁగుదెంచి పక్షులఁ గడును
త్సుకతన్ జూడఁగ లఘుపత
నకుఁడును సాధ్వసము దనమనమ్మునఁ బొడమన్.

5


మ.

పలుమాఱుం దనుజూడ లుబ్ధకుఁడు శుంభద్ధంభసంరంభతన్
వల యచ్చోటన యొడ్డి, యంద మఱి నానాధాన్యముల్ చల్లి య
వ్వలఁ బక్షిధ్వను లాచరించుచు మనోవాంఛారతి న్నిల్వ నం
త లసద్వేగమునన్ గపోతపతి చిత్రగ్రీవుఁ డుత్సాహియై.

6