పుట:పంచతంత్రి (భానుకవి).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బంధుసంతతియందుఁ బరమసంతోషమ్ము,
                    నాశ్రితులందుఁ బాయనితలంపు,
ధర్మమార్గమునందుఁ దగిలినచిత్తమ్ము,
                    సత్యవాక్యములందుఁ జతురతయును,
గలిగి యెవ్వాడు మెలఁగు జగత్త్రయమున
నతనికీర్తులు లుబ్ధమోహాంధతమస
పటల మణఁగింపఁ జంద్రికాప్రభలయట్లు
లలితగుణధుర్య! విఠ్ఠయ లక్ష్మణార్య!

133


వ.

అని యివ్విధంబునఁ జిరంజీవి తమపతియగు మేఘవర్ణునిఁ బ్రహృష్ట
చిత్తునిం జేసెనని నరేంద్రనందనులకు విష్ణుశర్మ యెఱింగించె నంత.

134


శా.

శేషాద్రీశ్వరపాదపద్మయుగళీచింతారతస్వాంత! వి
ద్వేషామాత్యజనాభివర్ణితయశోవిఖ్యాత! నానాకళా
భాషావల్లభ! నీతిశాస్త్రపఠనాప్రావీణ్య! చంచద్వయో
యోషానూతనమీనకేతన! నృపోద్యోగానవద్యప్రియా!

135


క.

చందనహరిహయహరిహర
కుందేందుసమానకీర్తిగోచర! [శిష్టా]
నందకర! రుక్మమాంబా
నందన! [శిబిఖ]చరవితరణప్రఖ్యాతా!

136


కవిజలరుహమిత్రా! కంతుసంకాశగాత్రా!
నవవితరణరాగీ! నాకపాభోగభోగీ!
ప్రవిమలతరకీర్తీ! బంధుసమ్మోదవర్తీ!
భువనహితచరిత్రా! పూరుషోద్యత్ప్రవిత్రా!

137

ఇది శ్రీభారతీవరప్రసాదలబ్ధవిద్యావిచిత్ర, తిప్పనమంత్రి
పుత్ర, సుజనవిధేయ, భానయనామధేయప్రణీతంబైన
పంచతంత్రి యను మహాప్రబంధమ్మునందుఁ
తృతీయాశ్వాసము.