పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ.

అనఘ సఖ సఖుండ వగునీకు మామక, వ్యథనకథన మభినయం బొనర్చి
సరసతావకాశ్వసనభాషితంబుల, గాఢసమ్మదంబుఁ గాంతు నేను.

84


సీ.

విను మహిళారోప్యమనుపట్టణము సర్వసౌభాగ్యవిలసనాస్పదము గలదు
దానిచెంగట వసుంధర బొక్క యొనరించుకొని యేను గౌరవంబున సుఖింతు
నటకుఁ జూడాకర్ణుఁ తనుతుచ్ఛసన్యాసి చనుదెంచి యేనుండుమనికిలోను
గాఁ గట్టిమఠము భిక్ష మనుదినము ధరాత్రిదశు లవ్వీటఁ బెట్టుదురు గాన


తే.

పెట్టుకొని పెద్దగాలంబు నిలువవలసి, స్నాన మొనరింపఁ డోంకారజపముఁ దడవఁ
డాంతముగఁ జూడఁ డంత వేదాంతవిద్య, కడుపు కైలాస మరయ నక్కష్టయతికి.

85


క.

కుక్షింభరుఁ డగునలయా, భిక్షుఁడు వేసరక తిరిగి భిక్షించిన యా
భిక్షము భక్షింపుదు ర, క్తాక్షుండై కేలఁ గోల నదలింపంగన్.

86


క.

ఆయతికూరిమిసఖుఁడు క, థాయతశతపారగుఁడు బృహస్వీకనువాఁ
డాయెడ కేతెంచె నుతా, మ్నాయా యొకనాటిమిట్టమధ్యాహ్నమునన్.

87


క.

వచ్చి పురాణోక్తకథల్, నెచ్చెలి వినుమనుచు నాతనికి రసధారల్
పిచ్చిల వినిపింపఁగ విన, కచ్చెనఁటి పరాకుఁబోలె నటుమొగ మయ్యెన్.

88


క.

అగుటయుఁ గథకుం డాయతి, మొగ మారసి పలికె మాఱుమొగ మైతి వయో
తగు నే నీతో రసపు, ష్టిగ నేరుపు మెఱసి కథలఁ జెప్పుచునుండన్.

89


శా.

నా కీచందముఁ దెల్పి చెప్పు మన విన్నంబోయినం బల్కెఁ జూ
డాకర్ణుండు సభాసుఖం బెఱుఁగ కిండ్లం భిక్ష భిక్షించి యం
టాకుంబొత్తికఁ బెట్టి తెచ్చి మఠమధ్యం జేర్చితిం జూడు నేఁ
డీకొండాటపుటెల్క యుల్కెఱుఁగ కి ట్లేపార భక్షించెడున్.

90


క.

నా కెక్కడిది పరా క, స్తోకంబగు నలుక నెలుకఁ జూచెద నని చూ
డాకర్ణుఁడు వల్క బృహ, స్వీ కాకర్ణించి యుల్లసిల్లుచుఁ బలికెన్.

91


క.

ఇక్కలుఁగున నిమ్మూషక, మెక్కటి మెలఁగుటకు వలయు హేతువు గలఁగన్
బొక్కల గములై యుండుట, నిక్కవ మిట్లొంటి నుండునే యుందురువుల్.

92


క.

ఒలువనితిలలకు నొలిచిన, తిల లీ నఱ్రాడువసుమతీసురభార్యా
తిలకమునం దొకకార్యము, తిలఘాతిని యూహసేయదే పూర్వమునన్.

93


క.

ఆకరిణి జాంగలంబున, నేకాకితఁ దిరుగునెలుకయెడ నూహింతుం
గాక యెుకకార్య మనఁ జూ, డాకర్ణుం డనియె నాదృఢప్రజ్ఞునకున్.

94


క.

ఒలువనితిలలకు నొలిచిన, తిల లీ నఱ్రాడువసుమతీసురభార్యా
తిలకమునం దేకార్యముఁ, దిలఘాతిని నిశ్చయించెఁ దెలుపవె యనుడున్.

95