పుట:పంచతంత్రము (బైచరాజు వేంకటనాథుడు).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"గజ మంటినట్ల యడఁచు, న్భుజగము మూర్కొనినయట్ల పొరిగొను ధరణీ
భుజుఁడు నగినట్ల చంపుం, గుజనుఁడు మన్నించునట్ల కొను బ్రాణంబుల్."

మనుజుఁ డెన్నండును స్వతంత్రుడు కాడు. భగవంతుం డేయేకాలమున నెట్టి త్రిప్పులం ద్రిప్పునో యట్లు తప్పక యనుభవింపవలయు ననుట కీమహాకవి యెట్లు కథాంశములను వాగ్రుచ్చెనో కనుఁగొనుఁడు.

సీ.

"ఘనరూపనిధి యనంగునకా యనంగత్వ? ముచితమే బలి కహివ్యూహవసతి?
పాండునందనునకా బహుకాలవనవాస? మిభపురాధిపునకా యేటిచొరవ?
యదుకులాధ్యక్షునకా శాపమరణంబు? జాహ్నవీసుతునకా శస్త్రశయ్య?
నలరాజుకా మహానసపాకభజనంబు? నహుషునకా ఘోరనాగమూర్తి?


తే.

మఱి త్రిశంకునకా పచ్చిమాలతనము?, ద్రుపదనందనకా రాచతొత్తుపాటు?
మనుజుఁ డెవ్వఁడు కర్మస్వతంత్రుఁ డరయఁ, నీశ్వరుఁడు గాక సమకూర్ప నిట్టిపనులు."

ఇందుఁగల యైతిహ్యముల నెట్లు జతకూర్చెనో.

ఇట్లే నీతులుగల పద్యములును, గంఠపాఠము జేసి పలుమారులు ప్రస్తావనావశంబునఁ జదువుకొనఁదగిన పద్యము లనేకము లున్నవి. అక్కడక్కడఁ బన్యములలో సామెతలనుగూడ నిమిడించి యున్నాఁడు. భాషయందుఁ బాండిత్యము లోకమునఁ గలిగింపవలెనన్న సామాన్యముగఁ బ్రచారములో నున్నమాటలనే యుపయోగించుచు గ్రంథములను వ్రాయుట యుచిత మనువారికెల్లరకు వందనసహస్రంబులు. గ్రొత్తపదంబులును సమాసచాతుర్యంబులును, నలంకారవిశేషంబులును భాష కలంకారప్రాయంబు లని యెన్ని గ్రంథజాలంబులను రచించి మహాకవిపండితులు లోకంబున భాషను బోషింతురుగాక యని నాయూహ.

ఇం దెందైన లోపంబు లుండక మానవు. 'ప్రమాదో ధీమతా మపి' యనువాక్యంబును దమమనంబున నిడి పరిశీలించి దోషంబులఁ బోఁ ద్రోచి గుణగణంబుల గ్రహింతు రని భాషాభిమానుల నెల్లరను వేఁడుచున్నాఁడను.

ఇట్లు విన్నవించు,
పండితాఖండలమండలపాదసేవకుఁడు,
కావ్యతీర్థ. కవిభూషణ జనమంచి వేంకటసుబ్రహ్మణ్యశర్మ,
సహాయాంధ్రపండితుఁడు, మునిసిపల్ హైస్కూలు, కడప.