పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

తుదిముట్టి యున్ననీ కొకఁ, డెదురే యది గాక పగఱ యే పడఁగినఁ ద
ప్పు దలంప నిదియ కడు నొ, ప్పిద మగు నినుబోఁటినృపులపెంపున కరయన్.

67


చ.

నలినజుఁ డైన బ్రహ్మకును నాలవవాఁడు దశాననుండు ని
ర్మలగుణలోల వీఁడు మనుమం డని చెప్పఁగ నాకు సి గ్గగుం
బలుకులు వేయు నేటికిఁ గృపాపరతాస్తుతి దక్క వీని మం
దల విడు నాకుఁగా నృపతిధర్మవిచక్షణ పుణ్యవీక్షణా.

68


చ.

అనవుడు నట్ల చేయుదు మహాత్మ భవద్విపులాంతరంగమో
దన మగుదానిఁ జేయఁ గని ధన్యుఁడ నైతి దశాస్యు వేగ తో
డ్కొని చనుఁ డన్న నానృపతికుంజరు మంజుమృదూక్తిఁ జిత్తరం
జన మగుడున్ మొగం బలర సంయమి దీవన లిచ్చి మెచ్చుచున్.

69


తే.

దనుజవల్లభు విడిపించుకొని పులస్త్యుఁ, డరుగ లజ్జావనతుఁ డగునతఁడు నతని
ననుపఁబోయిన సానునయంబు గాఁగ, బుద్ధిఁ దగఁ జెప్పి లంకకుఁ బుచ్చి చనియె.

70

రావణుఁడు వాలిచే భంగపడి యతనితో మైత్రి చేయుట

ఉ.

రావణుఁ డివ్విధంబునఁ బరాజయ మందియు లంకలోనికిం
బోవుడు నంతయున్ మఱచి భూవలయంబునఁ దొంటియట్ల నా
నావిధదుశ్చరిత్రము లొనర్చుచుఁ గ్రుమ్మరి యొక్కనాఁడు వి
ద్రావితశత్రుభూరుహచరప్రభు వాలి నెదుర్చువేడుకన్.

71


శా.

కిష్కింధానగరంబుపై నరిగి సుగ్రీవాదు లెల్లన్ రణా
విష్కారోద్యమతీవ్రు లైనఁ గని తకద్విక్రాంతి మానంగ మ
స్తిష్కంబున్ రుధిరంబు మాంసమును ధాత్రిం గూల్ప నుంకించియున్
దుష్కర్మం బగు వాలిలేమి నని చేతోవృత్తి నూహించుచున్.

72


క.

పడుచుంబైదలు పన్నినఁ, గడపి చనక చిఱుతతోడి కయ్యమునకు నేఁ
గడఁగుట తగ దని యాయని, విడిచి దశాననుఁడు వారు విన ని ట్లనియెన్.

73


క.

మీలోనఁ గూడుకొని రాఁ, డాలం బాలంబు సేసి యది యెట్లొకొ తాఁ
జాల నని చెప్పుఁ గా క, వ్వాలికి డాఁగినను బోవవచ్చునె నాచేన్.

74


చ.

అనవుడు సూర్యసూనుఁడు దశశాననుఁ గల్గొని నీవు నన్ను మె
చ్చనికత మేమిటం గొలఁది సాలనె వాలిని గూర్చి వచ్చితే
యనికిఁ గడంగినన్ బిరుదు లైనమగల్ గని వీరు గారు నా
కనియు నెఱుంగ కిట్లు భయ మందితి నీవెడమాట లేటికిన్.

75


శా.

నా కి ట్లెంతయు నీడఁ బోయితి జగన్మాన్యుండు నా నొప్పునా
నాకేశప్రియనందనుం జెనసి మానప్రాణముల్ గావఁగా
నీకుం దీరునె యిప్డు దక్షిణపుమున్నీటం గృతస్నానుఁ డై
యేకాంతంబున నుండుఁ బొ మ్మనినఁ బోయెం బుష్పకారూఢుఁ డై.

76