పుట:నిర్వచనోత్తరరామాయణము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్శంకత రాక్షసాన్వయభుజావిభవం బలర జగద్భయం
బంకురితంబు చేసెఁ దొలకాడెడు వీరరసంబుపెంపునన్.

114


తే.

ఇట్లు లంకాపురము వేడ్క నేలె సకల
దనుజలోకంబు సేవింప ననుజసహిత
ముజ్జ్వలశ్రీసమేతుఁ డై యుల్లసిల్లు
చుండి యాదశకంధరుఁ డొక్కనాఁడు.

115

శూర్పణఖకుఁ బెండ్లి సేయుట

క.

దర్పోన్ముఖయౌవనకం, దర్పాస్త్రసముజ్జ్వలాంగిఁ దనచెలియలి నా
శూర్పణఖఁ జూచి యోగ్యవ, రార్పణసమయ మని తలఁచి యనుజన్ములతోన్.

116


ఆ.

కాలకేయవంశకరుఁడు విద్యుజ్జిహ్వు, డతులబలుఁడు సుందరాంగుఁ డతని
కిత్త మెల్లభంగి నిత్తన్వి నని తగ, నాడి కార్యనిశ్చయంబు సేసి.

117


క.

దనుజపతి యున్ననగరం, బునకుం దగువారి నపుడ పుచ్చి యతని రాఁ
బనిచి సబహుమానంబుగ, నొనరించెం బరిణయము మహోత్సవలీలన్.

118

ఆశ్వాసాంతము

చ.

నిరుపమమూర్తి వైరిరథినీసమవర్తి వివేకవైభవ
స్ఫురితవిచారుఁ డుజ్జ్వలయశోమణిహారుఁడు ధర్మసంగ్రహా
దరపరతంత్రుఁ డార్యజనతామతమంత్రుఁడు వంశవారిజా
కరనవసూర్యుఁ డస్ఖలితగౌరవవర్తనధుర్యుఁ డిమ్మహిన్.

119


క.

కవిలోకవనవసంతుఁడు, యువతీనూతనజయంతుఁ డుదయానంతుం
డు వినయధనవంతుఁడు దానవినోదైకాంతుఁ డమలినస్వాంతుఁ డిలన్.

120


మాలిని.

అమరశిఖరిహేలాహారిధైర్యుం డవార్యా
క్రమభుజబలదృప్తారాతిసంహారుఁ డంహ
శ్శమనవినుతిపాత్రోచారగణ్యుండు పుణ్యో
ద్యమవిరచితలోకాత్యంతహృత్పర్వుఁ డుర్విన్.

121


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ
తిక్కననామధేయప్రణీతం బయినయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందుఁ దృతీయాశ్వాసము.

————