పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపుటము 13

నారసింహపురాణము

ఉత్తరభాగము

చతుర్థాశ్వాసము


క.

శ్రీమహితరామమాదృ, గ్గ్రామక్షీరాంబురాశిరాకాచంద్రా
సామాద్యుపాయనయవి, ద్యామతినిస్తంద్ర రంగయప్రభుచంద్రా.

1


వ.

ఆకర్ణింపు మాశౌనకాదిమహర్షులకు రోమహర్షణుం డిట్లనియె దేవరాతిప్రణీ
తం బగునీతివాక్యజాతం బంగీకరించి పంచజనపతిసంహరణపరాఙ్ముఖుం డై
శతమఖప్రముఖనిఖిలబర్హిర్ముఖవిదారణదారుణరణోత్కంఠుం డై దనుజకం
ఠీరవుండు సుఖం బుండునవసరంబున.

2


వర్షాకాలవర్ణనము

సీ.

ప్రోగువైచినపద్మరాగఖండంబులగతి నింద్రగోపసంఘములు దనరె
గరుడపచ్చలడాలుఁ గన్నుగీటఁగఁజాలు లేఁతపచ్చిక పిసాళించి మించె
నీశానదిగ్వాయులేశంబు లొకకొన్ని భంజళిగతుల విభ్రమము చూపెఁ
బ్రథమోదబిందుసంపర్కంబు పుడమిమైపొక్కు లాఁపఁగఁ దైలపూర మయ్యె
గగనగోపాలకృష్ణశిఖాపరీత, పింఛవలయంబు వోలె దీపించె నింద్ర
చాపవల్లీమతల్లి వర్షాశిలాక, లాపములు రాలె మొగులుమొల్లములనుండి.

3


స్వాగతవృత్తము.

వారిదఘోషము వారిరుహాక్షీ, వారమునల్కనివారణ సేయన్
సారరసోదయసంభ్రమలీలా, స్మేరముఖు ల్విలసిల్లి రధీశుల్.

4


సీ.

ధళుధళుక్కున నింగిఁ దాటించెఁ బలుమాఱు లలితవిద్యున్నటీలాస్యకేళి
ఘుమఘుమ నురిమె దిక్కులు పిక్కటిల్లంగ భూధరస్థలులు నంభోధరములు
జలజలఁ దలలెత్తి చా లేరుపడియె విడూరభూస్థలుల వైడూర్యశిలలు
నకనక లిచ్చు మానసఖేదదశ డించి పురివిచ్చి యాడె నయ్యురగభోజి
పాంథమోహనమంత్రదీపములువోలెఁ, గడిమిపూఁజేరు లురవయ్యె గహనవీథి
గాఢవర్షాగమారంభగర్వరేఖ, యవనితాపనివారణం బాచరింప.

5


మ.

గుడిచుట్టుం బలుమాలుఁ జందురుఁడు దిక్కుల్గొంచమై తోఁచెఁ గ
వ్వడినామంబులు వల్కి రెల్లసుజనుల్ వజ్రధ్వని న్వెచ్చి పె
క్కిడుమల్ గాంచిరి పాంథు లంధనిభ మయ్యెం జంతుసంచార మే
పడరెన్ జాతికిఁ బ్రీతి వాన జడిపింపం బోధముల్ చూపఁగన్.

6