పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 12


ఉ.

పెద్దఱికంబునుం బ్రియము పెంపు వహింపఁగ రాజ్య మేలు మీ
పెద్దలు భక్తితోడ మముఁ బేర్కొని పిల్చి సమస్తకార్యముల్
తద్దయు నేము చెప్పినవిధంబున నాచరణంబు చేసి యా
గద్దఱు లైన శాత్రవుల కండలు చెండి రుపాయచాతురిన్.

186


క.

అదిగావున మామాటలు, హృదయంబున కింపుచేసెనేనియు భక్తిం
బొదలుచుఁ దద్వృత్తాంతము, ముదలించెదఁ దేటతెల్లముగ సుగుణనిధీ.

187


క.

లోకాలోకనగేంద్ర, వ్యాకీర్ణప్రథితగుణలతానీక మహా
భీకరశాత్రవమదద, ర్వీకరవినతాతనూజ విభవబిడౌజా.

188


శా.

ఉల్లోకామలకోమలేతరకళానుష్ణచ్ఛవిక్షీర[1]వాః
కల్లోలస్ఫుట పుండరీకదివిషత్కల్లోలినీమల్లికా
వల్లీపల్లవఖడ్గఖండనశరద్వార్వాహసందోహసం
పల్లాలిత్యమిళద్యశోధవళిమభ్రాజద్దశాశాంతరా.

189


మాలిని.

శతధృతికులదీపా సత్యభాషాకలాపా
చతురనయధురీణా శౌర్యబాణారిబాణా
వితరణరవిపుత్త్రా విద్వదుద్యానచైత్రా
ప్రతిభటమదశిక్షా బంధురక్షాతిదక్షా.

190


గద్యము.

ఇది శ్రీహనుమత్కటాక్షలబ్ధవరప్రసాదసహజసారస్వత చంద్రనా
మాంకభారద్వాజసగోత్రపవిత్ర రామవిద్వన్మణికుమా రాష్టఘంటావ
ధానపరమేశ్వర హరిభట్టారకప్రణీతం బైనశ్రీనరసింహపురాణోక్తంబు
నందు నుత్తరభాగంబునందుఁ బ్రహ్లాదగుణవర్ణనంబును ఋతుసమాగ
మంబును నతండు దైత్యకన్యకలం బరిగ్రహించుటయును వనవిహా
రంబును బురప్రవేశంబును ననంబరఁగు ద్వితీయాశ్వాసము.

  1. వాక్కల్లోలస్పుట