పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంచిక 2-3

నారసింహపురాణము. ఆ-2

147


వ.

అట్టి సమయంబున.

123


సీ.

తరుణీదృగంజనద్రవలతాకీర్ణ మై యొకచోట నీలిమ నొదవఁజేసి
వామనేత్రీకుచద్వయకుంకుమాలేపకౢప్తిచే నొకచోటఁ గెంపునెఱపి
ననితాజనాంగచందనరసాక్రాంతిచే ధావళ్య మొకచోట నావటించి
సుదతులపసుపుపయ్యెదలని గ్గొదవుట నొకచోట హరితాళవికృతిఁ గూర్చి
కొలను బహువర్ణసాంకర్యకలిత మయ్యె, గుట్టు బయలయ్యెఁ గలఁకలోఁ దొట్టుకొనియె
నెట్టివారికి నేనియు నిందుముఖుల, గలసి మెలసినఁ గలుగునే గౌరవంబు.

124


గీ.

కామరూపుఁ డగుట గంధర్వమూర్తి య, య్యసురరాజసూతి యచ్చరలకు
నీడువచ్చుదానవేశ్వరదత్తక, న్యకలఁ గూడి క్రీడ లాడఁదొడఁగె.

125


క.

మరుఁ జేయుతూపుగములకుఁ, దరుణీమణివీక్షణములు తాపలొసఁగ ని
ర్దరవైరిసుతునిడెందము, గరఁగెన్ శిఖితప్తజతుశకలపరిపాటిన్.

126


సీ.

దానవాధీశవేదండంబు కాంతావశావశుం డగుట యాశ్చర్య మగునె
యసురమార్తాండుండు బిసరుహలోచనాప్రభలకు లోనౌట యభినవంబె
రాక్షసాధ్యక్షవళక్షభానుఁడు కాంత లనుతారకల గూడు టద్భుతంబె
క్రవ్యాదసింహంబు కలకంఠకంఠీగుహాలీనుఁ డగుట మహాఘనంబె
యనఁగ జలకేళివిహరణం బాచరించె, సారకాసారనవవారిపూరవీచి
ఘటలఁగుటిలేందునిటలాసగంధగాత్ర, గంధకలితాంగుఁడై మరుత్కంపనుండు.

127


గీ.

కంజపత్రాక్షి యోర్తు లాక్షాకరండ, తాడనంబునఁ జెనకిన దైత్యభర్త
దానికుచుమధ్యవీథిఁ గెందమ్మి నినిచె, ననవిలుతుఁ డేయుప్రథమబాణంబొ యనఁగ.

128


ఉ.

దానవరాజసూనుకరతామరసేరితవారిధారలన్
మానవతీశరీరనఖమండనముల్ పయిపూత లూడినం
గానఁగవచ్చెఁ బుల్కడుగఁగాఁ బ్రసవాస్త్రకృపాణపట్టికా
స్థానములందుఁ దోఁచునునుజాయలకైవడిఁ జూడ నందమై.

129


గీ.

తనదు[1]లోఁదొడఁ దేఁటిము ల్దాకెననుచు, మిట్టిపడునొక్కనునుజను[2]మిట్టలాఁడి
నోడ కోడకు మని నాథుఁ డూఱడించెఁ, జలువ కౌగిట జిగియార [3]సవదరించి.

130


ఉ.

దానవభర్త రత్నములు తాఁచినబుఱ్ఱటకొమ్మునీట న
మ్మానవతీజనంబుఁ బలుమాఱును జల్లుచుఁ గ్రేళ్లుదాఁటె వ
ర్షాసవమేఘమండలము చల్లనియుల్లసితాంబువృష్టిచేఁ
గాననభూములుం దడుపఁగా నగువిభ్రమ ముద్భవింపఁగన్.

131
  1. లోదడ
  2. మిట్టలాని
  3. సవధరించ్చి