పుట:నారసింహపురాణము - ఉత్తరభాగము (హరిభట్టు).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

248

ఆంధ్రసాహిత్యపరిషత్పత్త్రిక

సంపుటము 13


యోగనిద్రాసక్తి నురగేంద్రశాయియౌ నీలపర్ణుఁడు బిట్టు మేలుకొనియె
నభవుఁ గౌఁగిటఁ జేర్చె నచలరాజతనూజ కైలాసశైలంబు కంపమొందె
ధాతదిట దప్పె వేదమంత్రములయందు, సప్తవాయుప్రచారంబు చండివడియె
బీడువాఱిన యద్దంపుబిల్లవోలె, హల్లకారాతిబింబంబు క్రేళ్లుమలఁగె.

101


క.

ఆయెడఁ బ్రహ్లాదుఁడు కా, లాయసనారాచధార లమరబలముపైఁ
గోయని యార్చుచు సింగిణి, మ్రోయించుచుఁ గురిసె భువనములు ఘూర్ణిల్లన్.

102


వ.

సూచీముఖ శూర్పకర్ణ శంబర కాలకేయ కాలదంష్ట్ర వృశ్చికరోమ ధూ
మ్రాక్ష కపిలాక్ష వామనదందశూకప్రముఖప్రథమబర్హిర్ముఖులు శతమఖుం
బొదివి రాజానుమతంబున నాజినైపుణంబు మెఱయుటయు హరిహయుండు
కుండలితకోదండుం డై వేదండంబు దీకొలిపి కాకోలకీలికీలాకలాపరూపంబు
లగుతూపుల నాపిశితాశనులం గసిమసంగుటయు సింగంబుకరణిం బొంగి
యసాదసంగరాహ్లాదుం డగు ప్రహ్లాదుండు పాదరసంబుకరణిం ద్రొక్కనిచో
టులు ద్రొక్కుచు నుక్కు మెఱయుతురంగమంబుం బంచవిధగతితరంగితంబు
గం గదలించి తనపేరు ముదలించి యదలించి ప్రదరపంచకంబున నహ
ల్యావంచకు నొంచియు సప్తసాయకంబుల సప్తజిహ్వు రంహంబు నాఁగియు
మూఁడువాడితూపుల నంతకుఁ బ్రశాంతుం గావించియు నిశాటువిపాట
దశకంబునం బాటితలలాటతలుం జేసియుఁ బాశపాణి నాశుగననకంబున
నవకంబు చెఱచియుఁ బవనుఁ బవనజనంబు లగుపండ్రెడువెడందవాఁడితూ
వుల నే పణంచియు ధనదు నెనిమిదివిశిఖంబులఁ బిశితమయశరీరుం గావిం
చియు నీశానుం గృశానుజ్వాలాచటులంబు లగుబలుగోలలు పదునొకంట
గెంటించియు మిన్నంట నార్చి పేర్చిన [1]దివిజనివహంబు లుపచితాగ్రహంబు
లుగం బొంగారి చెలంగె.

103


చ.

మరలక రాక్షసేశ్వరకుమారుఁడు భల్లయుగంబు నేసి ని
ర్జరపతికేతనంబును నిశాకరవిస్ఫురదాతపత్రము
న్మురియలు సేసి వేఱొక యమోఘశరంబున విల్లు ద్రుంప న
చ్చెరు వెదఁ బిచ్చలింపఁగ శచీవిభుఁ డన్యధనుర్లతాగ్రుఁ డై.

104


ఇంద్రుఁడు ప్రహ్లాదునకు బోధించుట

క.

శర మరివోసి చతుర్దం, తరుచిరదంతావళాద్రి ధారాధరమౌ
గరువంపుమేను వెలయఁగఁ, బరిపంథిం బలుకుఁ బ్రౌఢభాషారభటిన్.

105
  1. దివిజనివహంబ్బులు లపహృతాగ్రహంబ్బులుగం