పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నరసింహకవి పాషండమతభేదాలను వచించే సందర్భంలో శాండిల్యుడనే మహర్షి పాషండ, జిన మతకారకులను వోడించడం కాదు వారిని సంహరించాడని యీ క్రిందిపద్యంలో పేర్కొన్నాడు.

"రూఢి శాండిల్యుఁను మునీంద్రుండు మున్ను
బాంచరాత్రప్రమాణప్రభావశక్తి
నాగమార్థంబు వ్యర్థమౌన ట్లొనర్చు
శఠులఁ బాషండజినులును సంహరించె."

(నార. 149. పు. 10. ప.)

వెలుగును వెన్నంటి చీకటి వున్నట్లుగా కష్టసుఖాలు కావడికుండ లన్నట్లుగా ఆస్తికత్వానికి భిన్నంగా దాని వెనువెంటనే నాస్తికమతం ఆవిర్భవించడంలో విచిత్రం లేదు. నరసింహకవి పేర్కొన్న సందర్భాన్ని పట్టిచూస్తే, పాషండజినమతాలు మన చరిత్రకారు లూహించినంత ఆధునికమతాలు కావని తేటతెల్లమవుతున్నది.

"అపకారికి నుపకారము నెప మెన్నక సేయువాడు నేర్పరి" అన్నభావం కేవలం సుమతీశతకకర్తనాటిభావమే కాదు. నేర్పరితనం మాట దేము డెరుగును కాని విద్రోహులకు సైతం మేలే చేయాలని వేదదేవగణాలు హార్దికంగా అభిలషించి నట్లు వ్యాఘ్రవానరకిరాతసంవాదంలో నరసింహకవి స్పష్టపరిచాడు. (నార. 149, 150. పు. 12వ, 13. 14. ప)

భస్మాసురుని కథ చాలా సుప్రసిద్ధమైనది. భస్మాసురుడు మహేశ్వరునిగురించి తపస్సు చేయడం, అతడు ప్రత్యక్షమై వరం కోరుకోవలసిందిగా చెప్పడం, నేను యెవనిశిరస్సుమీద చేయి పెడతానో అతడు భస్మం అవ్వాలని అతడు కోరడం, ఈశ్వరుడు సరే అని వరమివ్వడం, అసలు యీవరం ఫలిస్తుందో లేదో చూస్తాను. నీనెత్తిమీదే చేయి పెడతానని భస్మాసురు డీశ్వరునివెంట పడడం, చివరికి శ్రీమహావిష్ణువు మహేశ్వరుణ్ని కాపాడడం అందరికీ తెలిసిన విషయమే. అయితే అటు పామరులకు కాని యిటు పండితులకు కాని, ఆవరం పొందిన రాక్షసునిపేరు భస్మాసురుడనే అందరికీ తెలుసు. అసలుపేరు తెలియదు. ఈభస్మాసురుని అసలుపేరు నరసింహకవి విష్ణుచిత్తునికథలో "వృకాసురుడు"గా తెలియచేశాడు. (నార. 167. పు. 99. వ.)

సంసారవివర్జితుడై సన్యాసిగా జీవించడమన్నది బౌద్ధమతం తరువాత పరివ్యాప్తిలోకి వచ్చినవిషయమే కాని ఆర్షసంప్రదాయసిద్దం కాదు. వాస్తవానికి సప్తఋషులందరికీ భార్య లున్నారు. వివాహితుడు కాని మహర్షి యెంతటివాడైనా