పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/684

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

అతియుక్తి గురుఁడు చెప్పిన
హితమగునది సేయవలయు నియతమునున్ సా
ధుతకుఁడు; హితేతరంబుల
సతతగురుప్రియములైన జడుఁ డొనరించున్.

201


వ.

అటుగాన గురూక్తమైన విష్ణుభజనపరిత్యాగంబు సేయనొల్లనని
పలికిన దైత్యయాజ్ఞికులైన మాంత్రికులు రోషించి పావకోదితకృత్తిచే
హత్య చేసెదమని భర్జించినఁ బ్రహ్లాదుం డిట్లనియె.

202


మ.

తగ దాస్థానమునందు జేయ నురుమంత్రస్తోమవిక్షోభ; మీ
పగ గావించుట మీకు ధర్మమె? నిజవ్యాపాదనాశక్తికృ
త్తి గుఱింపం బని యేమి; లేవె యితరాధిక్యంబు లెన్నేని? హె
చ్చుగ నాయుఃపరిపూర్తి గల్గునెడ నెచ్చో నుండు నీకృత్తియున్.

203


శా.

కాలాత్మాభిహితుం గలంచి యణఁగంగాఁజేయు కృత్త్యాదికా
భీలక్రూరగ్రహంబు లీలగను గన్పింపంగ నాకృత్తి యా
కాలోత్తాలమహానలంబు తృటియై కాన్పించు నిద్ధాత్రిలో
నేలా కారణమున్నఁ దప్పునె ఫలం బింతే వితర్కించినన్.

204

·

వ.

ఇ ట్లనునప్పుడు.

205

దానవపురోహితులు ప్రహ్లాదునిపైఁ గృత్తిం బ్రయోగించుట

శా.

క్రోధస్రస్తవివేకులై ద్విజులు దుష్కర్మాత్ములై మంత్రగ
ర్వాధిక్యంబునఁ బొంగుచున్ హవన ముద్యద్భక్తిఁ గావింప దు
స్వాధస్పారతరస్ఫులింగములలో సక్రోధమై కృత్తి సం
బాధాటోపముతోడ నార్చుచు వడిన్ బ్రహ్లాదు ధట్టింపుచున్.

206


వ.

అప్పుడు సకలభువనంబులు గ్రక్కదల నార్చుచు శూలంబుఁ ద్రిప్పి
ప్రహ్లాదుని నాటించినఁ దజ్జ్వాలాస్ఫూర్తి హరిభక్తిరసాంబుధియైన
యతనివలన శమియించె; వహ్నిం గలసిన యుల్ముకంబుల చొప్పున
నేర్పడక జీవుండు బ్రహ్మంబుబలెఁ గలిసియుండె నంత.

207