పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/683

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అన్యభయమున సర్వేశు నఖిలవరదు
నెట్ల వినుతింపకుండుదు; నితఁడు దక్క
జనుల నెవ్వఁడు శాసించు? సర్వమునకు
నతఁడు శాసితవిప్రకులాఢ్యులార!

194


ఉ.

ఇంతియ కాదు ప్రాణభయ మేర్పడ మానవుఁ డబ్ధికన్యకా
కాంతు నుతింపఁగాఁ దగు; నకారణబంధుఁడు దాత, దైవ, మ
త్యంతహితుండు, తండ్రి, పరమాత్మ గుణాఢ్యులఁ బ్రోచు, దుష్టులన్
బంతముతో హరించు ననపాయమహోన్నతపుణ్యశీలుఁడై.

195


తే. గీ.

అతనిసంకీర్తనం బతిస్వల్పఫలము,
తెగువతో విడు మంటివి; తగునె నీకు?
దత్ఫలం బింత యనుచుఁ గీర్తనము సేయఁ
గలఁడె శంకరుఁ? డది వినఁగలఁడె ధాత?

196


క.

మాతండ్రి యిప్పు డలుగన్
హేతువు మఱి యెక్కడిది? రమేశ్వరకథనం
బీతఱిఁ బలుకుము మేఘము
చాతక మాశించునట్ల చయ్యనఁ గంటిన్.

197


తే. గీ.

భవదభిప్రాయ మిది యార్తిఁ బడినవేళ
హరి భజించు మనుట దురాశాంతరంబు
లివి సకలజంతువులు వెలయింప బ్రతుకు
నిత్యమే? యెన్నఁ డే మౌనొ నిర్ణయింప.

198


మ.

ధర నత్యంతసుదుర్లభం బగు నరత్వం బందియున్ మూఢుఁడై
దురభిప్రాయతఁచాడి యెక్కి కరముల్ దూలన్ ధరం బడ్డయ
ట్లురుశక్తిన్ సుఖియై మురారి మదిలో యోజింపఁగా లేఁడు; దు
స్తరరోగాతురుఁడై భజింపఁగలఁడే తద్దుఃఖజాడ్యంబులన్.

199


క.

ఆతురుఁడనై యొనర్చెద
నాతతమై, మెఱయ శ్రేయ మందెద నని యీ
బూతైన యాశ లన్నియు
యాతనలకుఁ ద్రోవ లందు రార్యోత్తంసుల్.

200