పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

కనలి ప్రహ్లాదరక్షకుఁడైన దేవుని
                       నెఱుఁగక యంత దైత్యేంద్రుఁ డడరి
క్రోధాంధుఁడై యతిక్రూరత నిజపురో
                       హితు నిరీక్షించి మహేర్ష్యతోడ
"నతిమూఢులార! ఖరాసిచే వీని ఖం
                       డించ వారించి మద్వంచనంబు
చేసితి రిఁక మిమ్ము శిక్షించి పిదప నీ
                       కులనాశకునిఁ బట్టి కూల్తు" ననినఁ


తే. గీ.

దద్ద్విజులు వానిసాహసోద్ధతి యెఱింగి
స్వామి కావింతు మే మభిచారకర్మ;
మందున హుతాశనుఁడు తృప్తినొంది దుష్ట
కృత్యఁగృత్తి వినిర్మించుఁ గిల్బిషమున.

188


క.

తంత్రముల వెలయు నస్మ
న్మంత్రంబులశక్తి చూడు మనుజాశన! యా
హంత్రముమీఁద బిడాలము
సంత్రాసము లేక యురుకుచందముఁ జూపున్.

189


వ.

అని ప్రహ్లాదుని నేకాంతంబునం దోడుకొని చని యిట్లనిరి.

190


సీ.

రాజకుమార! సర్వజ్ఞ! మహాభాగ!
                       నీబలసంపత్తి నేఁడు గాన
వచ్చె; శస్త్రేచ్ఛపావకనాగవిషముఖ్య
                       ములచేత బ్రతికితి; మూర్ఖుఁడైన
దైత్యేంద్రుఁ డంప నుద్ధతశక్తి నీధైర్య
                       మణఁగింపఁబూనియు, హరిపదాబ్జ
సేవకు నిన్ను హింసింప నుపేక్షించి
                       హితము చెప్పెదము సమిద్ధబుద్ధి


తే. గీ.

నిందిరేశస్తవంబు సహింపఁ డసుర
వరుఁడు; నీవును వదల వవ్వాసుదేవు;
నతని సద్భక్తి మెఱసి నీయంతరంగ
మునఁ జరించుట నీతియై పొడమె మాకు.

191