పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/668

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

నిరయాధ్వంబులఁ దిరిగెడు
నరులకు జ్ఞానోపదేశనవ్యవివేకాం
తరమునఁ ద్రిప్పెడు నాతఁడె
పరమగురుఁడు తండ్రి యాత్మబంధుఁడు వెలయన్.

136


క.

విషయములు సుఖకరములని
విషయాంతరములఁ జరించు వీరుండె మహా
తృషమృగతృష్ణలు గని [1]
ల్విషకాంక్షకు మృగము లేఁగు విధమున నుండున్.

137


క.

అగణితవిషయగ్రాహం
బగు భవవారాశి చూచి యాత్మఁ గలిఁగి స
ర్వగుఁడైన విష్ణుఁ డను తె
ప్పఁ గలుగఁ దరియింప, ముంపఁ బాడియె తండ్రీ.

138


క.

తను దానె విషయలోలత
మనుజుఁడు వర్తింప దాని మఱపుటఁ దగునే
యనలము బాలుఁడు పట్టఁగఁ
జనుచో నంగార మొసఁగఁ జనునే తండ్రీ!

139


వ.

ఇంద్రియార్థములయందుఁ బంచేంద్రియంబులం బ్రవర్తిల్లఁజేయుచు
నశిక్షులైన కుపుత్రులచేఁ దండ్రియంబోలె నష్టుండగు; స్వభిన్నునింగా
నీశ్వరున వేఱుగాఁ దలంచినవాఁడు విషయార్థప్రత్యగాత్మయైన
యీశ్వరు నెట్లు సేవించు? యామ్యదిశకుం బోయినవాఁడు మేరు
నగంబు విలోకించునే? విషయమోక్షమార్గంబులు పరస్పర
విరుద్ధంబులు; లోకమార్గంబున నడచిన నాకమార్గంబున నడువవచ్చునే!
తండ్రీ! విషయానుభవంబునందు దుఃఖపరంపర గాని శాంతి లేదు;
బ్రహ్మ మొక్కటి యశాంతికరంబు నీవు విషయానుభవంబు సుఖం బని
యంటివి; బహుదుఃఖమిశ్రంబై యల్పం బగుటంజేసి యది దుఃఖంబే;
నాశదాహాహరణశంకామిశ్రంబై బహుప్రయాససాధ్యంబై యల్పం
బైన విషయసుఖంబుఁ గాల్పనా? నింబచూర్ణకృతంబైన ముద్ద యెంత
స్వల్పగుణంబైన నది భక్షించు నెవ్వఁడు సుఖంబు నొందు?

  1. పర్విష