పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/667

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

శ్రేయములకు బహువిఘ్నము
లేయెడ; శ్రేయస్తమమగు నీశ్వరభజనం
బాయతబహువిఘ్నోద్యద
పాయంబులు సంతతంబు నంటకయున్నే.

129


తే. గీ.

కంససూదనుమీఁద నొకానొకనికి
నొకయెడ మనంబు తిరమయియుండు ధాత్రి;
నఖిలవిఘ్నా౦తరములు శ్రీహరి హరించు
హరిణపోతము శార్దూలపరమువోలె.

130


తే. గీ.

నిరతసర్వేశభావనానిష్ఠుఁడైన
దాని నిష్టార్థ మొసఁగు దేవతలుఁ గలఁతు;
రతిదురాత్ములు రాక్షసులైనఁ గలఁతు;
రెలమి గురులైన వారించి కలఁతు రెపుడు.

131


క.

దుర్లంఘేదృశవిఘ్నము
నిర్లక్ష్యము గాఁగ నిలిచి నిఖిలాత్మకు నం
తర్లక్షితుఁ జేసిన, ను
చ్చైర్లోకమునందు నతఁడు సర్వాధికుఁడై.

132


క.

నీచతరశీలుఁడ వగుట
నీచతరరసజ్ఞులైన నీమంత్రులచే
నేచెవిని బడిన వాక్యము
లేచిత్తము లాత్మవిఘ్నహేతువు లగుటన్.

133


చ.

సుతహితుఁడైన తండ్రి నిజసూనుని దుర్విషయానుభూతికిన్
మతిఁ బొడమంగఁ జేయుట క్రమంబగునే? సువిచారనీతి సు
స్థితివలె నాడఁగాఁ దగునె? ధీరహితుల్ తముఁదామె భోగవ
హ్నితతిఁ బడంగఁ ద్రోయుదురె నెక్కొని తద్విరతాత్మవృత్తులన్.

134


తే. గీ.

అంధులెల్లఁ బురఃస్థితమైన యట్టి
యంధువునఁ దామె కూలుదు రనఁగ నేల?
నొకవిధంబునఁ గడితేరుచున్న నన్ను
విషయవారాశిలో ముంప వేడ్క యగునె.

135