పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/658

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

బాల్యమున నీవు బ్రాహ్మణప్రవరు లాడు
నిష్ఠురోక్తిపరంపర నీఱుగప్పు
నిప్పువలె నుండి ప్రభ లేక నేఁడు వత్స!
జాడ్యమంతయుఁ దేరి తేజమున నుంటె.

90


సీ.

అజ్ఞాననిధియైన యట్టిబాల్యము వోవ
                       నీహారముక్తుఁడౌ నీరజాప్తు
పగిది నుండిన నిన్ను బ్రాహ్మణు లేరీతిఁ
                       జేరి బోధింతు రశీలపథముఁ
బ్రాయంబునందుఁ దద్బ్రాహ్మణులే నిన్ను
                       నిట్లు శిక్షించిరి హిత మెఱింగి;
రాజ్యభారదురంధరత నీవు గైకొన్న
                       సుఖమున నుండెద శుభము లొంది;


తే. గీ.

యఖిలదుష్కంటకనివృత్తి నవనినేలు
నీమహైశ్వర్య మీక్షింప నెమ్మిపుట్టె;
గురుఁడు నిను మెచ్చె విద్యాధికుండ వనుచు
వీనులకు నది విన నేఁడు వేడ్క యయ్యె.

91


తే. గీ.

శత్రుదారిద్య్రమెల్ల లోచనములకును,
సుతుని సూక్తులు చెవులకు, వితతయుద్ధ
రంగరంగద్వ్రణంబు గాత్రంబునకు, స
ముద్యదభిమానులకును మహోత్సవములు.

92


వ.

అని యిట్లు.

93


క.

నికృతప్రజ్ఞాసంపద
వికటంబుగఁ దండ్రి పలుక విని నిశ్శంకా
త్మకుఁడై ప్రహ్లాదుఁడు యో
గికులాగ్రణి యుత్సవంబు గీల్కొనఁ బల్కెన్.

94


క.

శోత్రములకు విష్ణుకథా
పాత్రప్రథితోక్తులే యపారోత్సవముల్
చిత్రముగ నెట్లు పల్కిన
శ్రోత్రార్హమె యన్య మది సుదృష్టం బగుటన్.

95