పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చంద్రవంశపు రాజైన యయాతి దేవయానిని వివాహం చేసుకొనడం, అనంతరం దేవయానిదాసీయైన శర్మిష్ఠతో సంగమంచేసిన కారణంగా శుక్రశాపానికి గురియై వార్ధక్యాన్ని పొందడం, చివరికి ధర్మసూక్ష్మవివరణతో శుక్రుని అనుగ్రహంవల్ల పుత్రయౌవనాన్ని యయాతి స్వీకరించి చిరకాలం శృంగారప్రియుడై, సకలభోగోపజీవియై జీవించి తనకు యౌవనాన్ని అడిగినవెంటనే యిచ్చివేసిన తనపుత్రుడైన పూరునికి తన యౌవనాన్ని తిరిగి యిచ్చి రాజ్యపట్టాభిషిక్తుని చేసి, ఆశ్రమవాసానికి వెళ్లడం సుప్రసిద్ధమైన కథ. యయాతి జీవితంలో అకాలంలో వార్దక్యం రావడం, తన పుత్రుడైన పూరుని యౌవనాన్ని తాను పొంది అనేకసంవత్సరాలు శృంగారప్రియుడై సుఖలాలసుడై జీవించడం కేవలం దేవయానితండ్రియైన శుక్రాచార్యుని శాపానుగ్రహాలవల్లనే జరిగింది కాని, సహజంగా జరగలేదు. కాని రుక్మాంగదుని జీవితంలో, ఉద్దేశపూర్వకంగా బ్రహ్మ విశిష్టంగా సృష్టించిన మోహినిని మందరనగసీమనుంచి పరిగ్రహించి, ఆమె మోహానికి లోనౌతాడు. నిజాని కప్పటికి రుక్మాంగదుని కుమారుడైన ధర్మాంగదుడు యువకుడైనా కాడు. కుర్రవాడు. కాని రుక్మాంగదుడు వార్ధక్యదశలోనే మోహినిని పరిగ్రహిస్తాడు. సప్తద్వీపపరీతభూవలయాన్ని పరిపాలింపవలసిందిగా తనపుత్రుడైన ధర్మాంగదుడిమీద రుక్మాంగదుడు భారం పెడతాడు. అయితే జగన్మోహినియైన మోహినితో విహరించడానికి తగిన యౌవనశక్తి రుక్మాంగదునికి లేదు. కాని ధర్మాంగదుడు తెచ్చిన మణుల కారణంగా రుక్మాంగదుడు, యౌవనం పొంది చిరకాలం భోగా లనుభవించినట్లు కనిపిస్తున్నది. వృద్ధుడైన రుక్మాంగదునికి యౌవనప్రాప్తిలో యయాతిచరిత్రలోవలె, యెటువంటి శాపానుగ్రహాల ప్రసక్తి లేదు. "నీవు సుతుండ వైన కతన నాకు నీ జగన్మోహినియైన మోహినితోడ విహరింపఁ బునర్యౌవనప్రాప్తి యయ్యెడు. మనుష్యలోకంబున వృద్ధునకు సురతానురాగంబు గలుగుట హాస్యకరంబు. మేను జీర్ణంబయ్యె. శిరోరుహంబులఁ బలితంబు వొడమె. జీర్ణుండనైన నీచే నజీర్ణుండ నై భోగంబు లనుభవించెద. నే నీకాంత నాకాంతంబు విడిచి నాకాంతయై వచ్చుటం జేసి భవద్బాహుగుప్తుండనై బర్హినిర్ఝరదివ్యనదీతటంబుల విహరింతు నీపురంధ్రి మత్ప్రాణంబు. దివ్యకాంత. ఏతన్నిమిత్తంబుగా దేవతలు ఖేదంబు నొందుచుం జనిరి. దీని సంరక్షింపవలయుననిన తండ్రి వాక్యంబులు విని యుపచారంబులు గావింప నాజ్ఞానువర్తుల నియోగించి రాజ్యభారంబు వహింపు చుండె." (నార. 253. పు. 309. వ.) ఆర్షవిజ్ఞాను లైన రుక్మాంగద, ధర్మాంగదులు కేవలం తమ మహత్తరాలైన మణులశక్తుల వల్లనే నిత్యయౌవన, శక్తులను సముపార్జన చేసుకున్నట్లు అర్థమవుతున్నది. విదిశాపురాధిపతియైన రుక్మాంగదునికుమారుడు ధర్మాంగదుడు తండ్రిని మించిన తనయుడు. సప్తద్వీపాలను సైతం