పుట:ధనాభిరామము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

73

   మృతాలోల కారుణ్యసంశీల గంధేభచర్మాంబరా సర్వదర్వీక
   రాధీశ కేయూరసృత్యాంకకోటీర కర్పూరసంకాశ ఆకాశ
   కేశాయ యీశ మహోక్షాధిరూఢాయ విరూపాక్ష ధక్షా
   ధ్వరాధ్యక్ష శిక్షానికాపేక్ష సద్భక్త సంరక్ష పద్మజనీరేజగ
   ర్భామర వ్రాతమౌనీంద్ర సంఘాత సంపూజితాంఘ్రి ద్వయో
   పేత గంగానదీజూటసంఫుల్లలాలాట స్ఫురత్కోటిసూర్య
   ప్రభా భాసురాకార శూలాయుధా భూతనాథ మహాదేవ
   యుత్పత్తికిం గర్తవై రాజసం బొప్పఁగా బ్రహ్మవై సర్వలో
   కాభిరక్షస్థితిం జాలి యాత్మైకభావంబునం బద్మనాభుండవై
   సర్వసంహారక్రియా తామసస్ఫూర్తిచే మించి రుద్రుండవై
   భూతాంతరవ్యాపివై నిండి బ్రహ్మాండహస్తాల్ వినోదంబుగా
   మేనఁ బుట్టింప ద్రుంపన్ మదిం జాల విస్ఫూర్తిచే చంద్ర
   సూర్యాగ్ని వాతావనీ వ్యోమకాండాత్మ రమ్యాష్టమూర్తి
   క్రియ న్మించి చిద్రూపమైయుండి నీరూప మేరూపముం గానఁ
   గా లేక అధ్యాత్మవిద్యామహోల్లాసులై సంయమీంద్రుల్
   మనఃపంకజాతంబుల న్మిమ్ము భావించి సేవింతు రెల్లప్పుడున్
   దేవ మీదివ్యతత్వస్వరూపంబు వర్ణింప శక్యుండనై కాల
   కాలాంతక ఫాలనేత్ర భవత్పాదసేవాసమగ్రైకచిత్తుండనై
   యుండ నాకుఁ బ్రసాదింపు దిగ్వాస కైలాసవాసా కృపావేశ
   శ్రీదక్షవాటీపురాధీశ భీమేశ యీశా నమస్తే నమస్తే
   నమస్తే నమః.100