పుట:ధనాభిరామము.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

ధనాభిరామము


చ. ఇరవొకయింతలేక ధనమిచ్చి వరించిన నీక యుండినన్
    సరసత మీఱ నొక్కనివసంబుననుండి ధనంబు చూచి తా
    నొరుకడ కేఁగఁ జూచి తిది యొచ్చెముగాదె యెఱుంగ నేర్చినన్
    దరుణిరొ వారకామినికి ధారుణిలో వివరించి చూచినన్. 86

చ. విను నీవుండినయంతగాలమును నే వేవేలు దెచ్చిచ్చినన్
    ధననాథుం డరుదెంచెనేని పిలువం దథ్యంబు రమ్మంచు నన్
    గొనుచు న్వచ్చిట నీవు ధనమున్ యాసించి పోఁజూచెదే(?)
    మనువాడ న్నిను వారకాంతలకు సత్యం బెద్ది లోకంబునన్. 87

క. అతులనవరూపవిద్యా
   చతురత్వము చూడవైతి జలజానన స
   మ్మతి మీఱ ధనముఁ జూచితి
   క్షితి వారాంగనల నెందుఁ జేరఁగఁ బాసెన్. 88

క. సుగుణ వనుకొందు మఱి నీ
   సుగుణత్వము విడిచి జోగిఁ జూడఁగఁ జనుటే
   సుగుణితన మెన్న నేటికి
   సుగుణావతి సుగుణతనము చూచితి మిచటన్. 89

వ. అనిన విని మారుమాటాడం జూలక సుగుణావతి యూర
    కుండిన నధికకోపావేశంబున లేచి సకలపాతకజాత యగు
    లంజమాత యిట్లనియె. 90

ఉ. పల్లవకోటిచే సకలభాగ్యములుం గొనితెచ్చి పెట్టి యి
    ల్లెల్లనుఁ బ్రోచుబిడ్డను మరెక్కడ వెళ్లఁగ నీక కూడి రం