పుట:ధనాభిరామము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

క. శ్రీమత్పర్వతపతిపు
   త్రీమహితాననసరోజదినకర వరసు
   త్రామచతురాస్యదాక్షా
   రామ శ్రీభీమనాథ రాజార్ధధరా. 1

క. విన నవధరింపు ధనధుం
   డనిమిషపతియొద్ద సభికు లందఱు వినఁగా
   మనసిజునితోడ నాడిన
   తవపరమగుప్రతినఁ దీర్ప ధరణికి వచ్చెన్. 2

సీ. మెరుఁగారుమువ్వన్నె మెఱయు బెబ్బులితోలు
           కటితటిదిండుగాఁ గప్పె నడుమ
    పద్మరాగప్రభాపటలంబు విలసిల్లు
          డంబైన వొడ్డియాణంబుఁ బెట్టి
    కర్పూరరజముతోఁ గలహించు నునుభూతి
          సర్వాంగములయందుఁ జాల నలఁది
    పొలుపొంద నవరత్నములకాంతి వెదజల్లు
          కుచ్చలగంతమైఁ గుదురుకొలిపి
    శిరము ముత్తెలవిరులును శింగినాద
    మమర వజ్రాలకామాక్షు లర్థిఁ దాల్చి
    నొసల కస్తూరిబొట్టిడి యెసఁగ యోగి
    రాజరూపంబుఁ దాల్చె నారాజరాజు. 3