పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

గుణమును బట్టియే దీని నాదరింపఁజూచుసరసులకు, ఇదిమెచ్చుగొల్పునేగాని నిరసనభాజనముగాదు.

ఈతిమ్మయవంటివారే భారతభాగవతాదులను బాటలుగా ఆటలుగాఁ బదములుగా శతకములుగా వెలయించి, వానిపరమార్థమును సంఘమున నెవరికిఁ దగినట్టు వారికిఁ బంచిపెట్టిన నిష్కామయోగులు. ఆరచనలన్నియుఁ బామరములనియు నప్రౌఢములనియు దోషభూయిష్ఠములనియు, నిపుడు వానిసంస్మరణముసైతము మఱచిపోయితిమి కావుననే మనవాఙ్మయశరీరమున నొకపార్శ్వము పక్షవాతపీడితమై చచ్చుపడినది. దానినిఁ బునరుజ్జీవింపజేయుట మనకు మానరానికర్తవ్యము.

ఇదియొకప్పుడు పేరుపడినగ్రంథమే యనియు, దీనిప్రతులు ఆంధ్రదేశమెల్లెడలఁ బ్రాకినవనియుఁ జెప్పుటకు సందియములేదు. కానిచో విరాటపర్వపుఁబ్రతి యొకటి తంజావూరిలో, నింకొకటి నైజామురాష్ట్రములో నెట్లులభింపఁగలవు! కావ్యజీవమునకు వ్యాప్తియేకదా పరమప్రమాణము! ఇది యాంధ్రదేశమెల్లెడలను సంచరించుచు సజీవమైయున్నది. కవిత్రయభారతముముందుఁ దలయెత్తుకొని యిది నిల్చియుండుటలోఁగల విశేషమేమో సహృదయులే యూహింతురుగాక.

ప్రాచీనతాళపత్రగ్రంథములను సంస్కరించి ముద్రింపఁబూనుకొనువారికిఁ గావలసినసదుపాయములలో మొదటిది ప్రత్యంతరలబ్ధి. వివిధప్రతులసాహాయ్య మున్నచో వానియందలి పాఠాంతరములఁ బరిశీలించి, "యేది నాధువు - ఏది యనాధువు, ఏది కవిది - ఏది కాదు" అనువిషయములను నిర్ణయించుకొని, గ్రంథమునంతయుఁ గవి హృదయానుసారముగా నొకసూత్రమునకుఁ దెచ్చుటకు వీలగును. ఆసాయము లేనినాఁడు సంపాదకుఁడు పడు క్లేశము ఆతనికే యెఱుక. ఈద్విపదభారతసంస్కరణమున నాబుద్ధి కట్టిశ్రమయే గలిగినది.

ఒక్కతంజావూరిలోఁదప్ప నీయాదిసభాపర్వములకు వేఱొకప్రతి యెచ్చటను దొరకలేదు. దానికిఁదోడు ఉన్నయొక్కప్రతియు వివిధలేఖనప్రమాదములతో నిండియున్నది. అందుచే ననేకపదముల స్వరూపము, వాక్యముల యన్వయముఁ దాఱుమాఱైయున్నది. వానిని సాధ్యమైనంతవఱకు సురూపములుగను అన్వితములుగను జేసితిని. ఒక్కొకచోట ఆలేఖనప్రమాదము అగమ్యగోచరమైనప్పుడు విడదీయరాని గ్రంథులవలెఁ గొన్నిపదములు, వాక్యములు మిగిలినవి. అట్టివానిని సవరించుట నేను