పుట:ద్విపద భారతము - ఆది సభా పర్వములు.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

266

ద్విపద భారతము


నప్పుడు లేమనునంధకారంబు
గప్పిన మదిలోనఁ గడుఁదత్తరించి,
కౌగిటఁగదియించి కన్నీరు దుడిచి,
మూగినవగలతో ముద్దుపాపనికి
బాలెందులేమికి భావించి వగచి:
"పాలకు నాల్గేనుపాఁడికుఱ్ఱలను
బాంచాలుఁడొసగక పాలుమాలెడినె!
'పంచియిచ్చెద రాజ్యభాగంబు నీకు'
నని బాల్యమునఁబల్కె నతఁడుమాతోడ;
మనమున నామైత్రి మఱవంగఁగలఁడె!
ఇల పంచియీకున్న నీమాత్రమైన
గలిమితో నొసగక గడవజాలెడినె!
బలిమి నాచెలికాఁడు పాంచాలవిభుఁడు
చెలువార రాజ్యంబుసేయుచున్నాఁడు;
కోరినంతర్థంబు కొదవడకుండ
బోరననిచ్చు నేబోయెదఁగాక".

ద్రోణుఁడు ద్రుపదుచే నవమానితుఁడగుట



అనిమదినూహించి, యతివయు నేను
దనయునిఁదోడ్కొని తగు ప్రయాణములఁ
బొలఁపొందఁ గాంపిల్యపురికి నేతెంచి,
పొలఁతినొక్కెడనుంచి పోవుచో, నెదుట
మణికిరీటోజ్జ్వల మకుటవర్ధనులు
ప్రణమిల్లి వినతులై బహుభంగిఁగొలువ,
[1]భండనాధ్యక్షు లప్రతిహతబలులు
దండనాయకులు నుద్దండతఁ గొలువ,

  1. ఖండనాధ్యక్షులై ప్రతిహతబలము (మూ)