పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశదీకరణము 1:-ఒక ముఠాలోని వ్యక్తులలో ఒకరుగాని అంతకంటే ఎక్కువ మందిగాని ఆ ముఠా ఉమ్మడి ఉద్దేశమును సాధించుకొనుటలో ఒక స్త్రీని మానభంగము చేసినచో, ఈ ఉపరిచ్ఛేదపు భావములో వారిలో ప్రతి వ్యక్తి యు సామూహికముగా మానభంగము చేసినట్లు భావింపబడును.

విశదీకరణము 2 :- “మహిళల లేక బాలల సంస్థ " అనగా, అనాధ శరణాలయము, ఉపేక్షిత స్త్రీల, లేక బాలల గృహము, లేక వితంతుశరణాలయము, లేక ఏదేని ఇతర పేరుతో పిలువబడుచున్నదైనను, స్త్రీలను లేక బాలలను చేర్చుకొనుటకును, వారి సంరక్షణ కొరకును స్థాపింపబడి నిర్వహింపబడునట్టి సంస్థ అని అర్థము.

విశదీకరణము 3 :-- “ఆసుపత్రి" అనగా ఆసుపత్రి యొక్క ఆవరణ అని అర్థము, మరియు ఆ పద పరిధిలో, కోలుకొనుచున్న వ్యక్తు లనుగాని, వైద్య పరిచర్య అవసరమైన వ్యక్తు లనుగాని తిరిగి ఆరోగ్యవంతులనుగా చేయవలసియున్న వ్యక్తులను గాని చేర్చుకొని చికిత్సచేయు ఏదేని సంస్థ ఆవరణలు చేరియుండును.

వేర్పాటు సమయములో ఒక వ్యక్తి తన భార్యతో సంభోగించుట.

376-ఏ. తన భార్య వేర్పాటు డిక్రీ పొందియుండిగాని, ఏదేని ఆచారము లేక వాడుకనుబట్టి గాని, విడిగా నివసించుచుండగా, ఆమెతో ఆమె సమ్మతి లేకుండ సంభోగము జరిపినతడెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాపముతో శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

పబ్లికు సేవకుడు తన అభిరక్షలో నున్న స్త్రీతో సంభోగించుట,

376-బి. పబ్లికు సేవకుడై యుండి, తన పదవీ ఆసరాతో అట్టి పబ్లికు సేవకునిగా, తన అభిరక్ష లోనున్న లేక తనకు ఆధీనస్ఠు డైన ఒక పబ్లికు సేవకుని అభిరక్ష లో ఉన్న ఎవరేని స్త్రీని, తనతో సంభోగము జరుపవలెనని ప్రేరేపించు లేక ప్రలోభ పెట్టు నతడెవరై నను, అట్టి సంభోగము మానభం గాపరాధము క్రిందికి రాకున్నను, అయిదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

జైలు, బందీ గృహము మొదలగువాటి అధీక్షకునిచే సంభోగము,

376-సీ. ఒక జైలు, బందీ గృహము, లేక తత్పమయుమున అమలునందున్న ఏదేని శాసనముచే లేదా అట్టి శాసనము క్రింద స్థాపింపబడిన ఇతర అభిరక్ష స్ఠానము లేక మహిళల, లేదా బాలల సంస్థ-వీటిలో దేనియొక్క మేనేజరుగాగాని ఆధీక్ష కుడుగాగాని ఉండి, తన పదవీ ఆసరాతో, అట్టి జైలు, బందీ గృహము, అభిరక్ష స్థానము లేక సంస్థలో ఉంటున్న ఎవరేని స్త్రీ ని తనతో సంభోగము జరుపవలెనని ప్రేరేపించు లేక ప్రలోభ పెట్టు నతడెవరైనను, అట్టి సంభోగము మాన భంగాపరాధము క్రిందికి రాకున్నను, అయిదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడును. మరియు జార్మానాకు కూడ పాత్రుడగును.

విశదీకరణను 1:- “జై లు, బందీ గృహము, లేక ఇతర అభిరక్ష స్థానము, లేక మహిళల లేదా బాలల సంస్థకు సంబంధించి “ఆదీక్ష కుడు" అను పదపరిధిలో అట్టి జైలు, బందీ గృహము, అభిరక్ష స్థానము, లేక సంస్థలో ఏదేని ఇతర పదవియందుండి ఆ పదవినిబట్టి అచట ఉంటున్న వారిపై అధికారము వినియోగించుచున్న లేక నియంత్రణ కలిగివున్న వ్యక్తి చేరియుండును. "

విశదీకరణము 2 :-- "మహిళల లేదా బాలల సంస్థ " అను పదబంధమునకు 376వ పరిచ్ఛేదము లోని ఉపపరిచ్ఛేదము (2) యొక్క విశదీకరణము 2 లో గల అర్థమే ఉండును.

ఆసుపత్రి యొక్క యాజమాన్యము, లేక సిబ్బందిలోని వారెవరైనను ఆసుపత్రిలోని స్త్రీతో సంభోగము జరుపుట.

376–డీ. ఆసుపత్రియొక్క యాజమాన్యములో లేక ఆసుప త్రియొక్క సిబ్బందిలోని వాడై యుండి తన పదవి ఆసరాతో ఆసుపత్రిలోని ఏ స్త్రీ తో నైనను సంభోగించిననో, అట్టి సంభోగము మావభంగాపరాధము క్రిందికి రాకున్ననూ, అయిదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడును. మరియు జూర్మానాకు కూడ పాత్రుడగును.

విశదీకరణము :- "ఆసుపత్రి" అను పదమునకు పరిచ్ఛేదము 376 లోని ఉపపరిచ్ఛేదము (2) యొక్క విశదీకరణము 3 లోగల అర్థమే ఉండును.

ప్రకృతి విరుద్ధ అపరాధములను గురించి

ప్రకృతి విరుద్ధమగు అపరాధములు.

377. ఎవరేని పురుషునితో, స్త్రీ తో లేక జంతువుతో స్వచ్ఛందముగ ప్రకృతి విరుద్ధమైన మై ధునము సలుపు వారెవరైనను, యావజ్జీవ కారావాసముతో గాని పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటితో ఒకరకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

విశదీకరణము :-ఈ పరిచ్ఛేదములో వివరింపబడిన అపరాధమునకు ఆవశ్యకమైన మైధునమగుటకు అంతర్గమధనము చాలును,