పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

రణసన్నద్ధక్రియచే
గణియించక గదియఁ దాటకాతనయ ఖలా
గ్రణి యనిలసాయకాహతిఁ
దృణలీలం గడలినేసెఁ దేలి చనంగన్.

113


గీ.

అతనిచాయి యెదిర్చిన నస్త్రకలన
జెక్కలై నేల ద్రెళ్లంగఁ జేయఁగాంచి
కాకఁ గదిసిన రాక్షసఘటలనెల్ల
నర్కనందననగరికి ననిచె నంత.

114


క.

ఇక్కరణి కార్యసిద్ధిగ
నక్కఱ గాధేయజటి నయక్రియ నతనిన్
జక్కఁగఁ గౌఁగిటఁ జేర్చెన్
జక్కఁగఁ ద్రిదశగణగణన సంధిల్లంగన్.

115


వ.

ఇట్లరణ్యాని నిష్కంటకాకృతిగాఁ జేసి తన యజ్ఞదీక్షఁ గడతేర్చినదానికి
గాధిజర్షి సంతసిల్లి దాశరథి కైంద్రాగ్నేయాదిసకలశస్త్రాస్త్ర
జ్ఞానసిద్ధిగా నానతిచ్చి తగిననా ళ్లక్కడ నధిష్టించి రయ్యెడ.

116

ఆశ్వాసాంతము

క.

అతులప్రతాపతపన
ప్రతిభా! ధావద్విపక్షబల! కౌశికసం
శ్రితవలయ! వసుమతీధర!
సతతకృపాభ్యంతరాళ సాంద్రధ్వాంతా.

117


మ.

అతులాంభోనిధిధామ! ధామజితకోట్యాదిత్య! దిత్యంగనా
పతిహృద్వారిజవాస! వాసవనుతప్రాబల్య! బల్యాగ్రహ
[1]ప్రతతిచ్ఛేదనసత్త్వ! సత్త్వయుతశోభాకాంత! కాంతామణీ
రతిరాజప్రతిమాన! మాననయధైర్యస్థైర్యశౌర్యోన్నతా.

118
  1. ప్రతిత (ము)