పుట:దశకుమారచరిత్రము.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

దశకుమారచరిత్రము

క. మన పెద్దతోఁటలోనికి
     జని యయ్యెడ మెలఁగఁ గీలు జరిగిన నచ్చో
     టన పడియె నొక్కయందియ
     దిన మెల్లను వెదకి కానఁ దెఱఁ గేదుటయున్.159
వ. వగచుచున్నవార మని చెప్పి యొక్కయందియ పుత్తెంచిన
     ననంతకీర్తి కలహకంటకుం బట్టుకొని రచ్చకుం డెచ్చి య
     చ్చోటి జనంబుల కెఱుంగఁ బుచ్చిన వార లడుగ నాధూర్తుం
     డి ట్లనియె.160
ఉత్సాహ. మీరు నిలుపఁ గాటికాపుమేర పట్టి నిలిచి యి
     య్యూర నున్నవారు కొంద ఱోపు లేక యగ్నిసం
     స్కారవృత్తి రాత్రి చేసి చనుట వినుటఁ జేసి రే
     లారయంగఁ బోదు మొన్న నచట నద్భుతంబుగాన్.161
క. కాలియుఁ గాలని పీనుఁగు
     నేలకు నొఱుగంగఁ దిగిచి నెనడులు కముపం
     గా లలన నొకతెఁ గని యది
     చాలఁ దొడవు దొడిగి యున్న సాహసవృత్తిన్.162
మ. ధనలోభంబున నీతి వోవిడిచి యుద్దాముండనై యాయుధం
     బునఁ జంపం దలపోసి చేర నని పోఁబోఁ గాలు నాచేతఁ జి
     క్కినఁ గత్తిం దొడ వేసి నేఁ దిగిచినం గీల్దప్పి మత్పాణితో
     డన యీయందియ వచ్చె నవ్వనితఁ బట్టం జూడఁగాఁ బర్విడెన్.163
క. ఇది దెఱఁ గని చెప్పిన నా
     సదస్యు లచ్చెరువుఁ బొంది సత్యమ కా నె
     మ్మదిఁ దలఁచి పనిచి రాసతి
     హృదయేశుని దానిచంద మెల్లను నరయన్.164