పుట:దశకుమారచరిత్రము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

దశకుమారచరిత్రము

     భాగ్యంబునందు శ్రీ ప్రతియయ్యెనేనియుఁ
                    దాలిమి నీలతాతన్వి కెనయె
     తాలిమి భూదేవి తగ సాటియగునేని
                    నేర్పున నీపద్మనేత్ర కెనయె
తే. యని యనేకవిధంబుల నఖిలజనులు
     పొగడ నెగడెఁ గృపాపరిపూరితాంత
     రంగ కొమ్మనామాత్యు నర్ధాంగలక్ష్మి
     యఖిలగుణగణాలంకృత యన్యమాంబ.85
క. ఆరమణి పరమపావన
     నీరజభవనాన్వయాంబునిధిచంద్రిక పూ
     ర్వారాధితదేవత యా
     గౌరవ మభివృద్ధి పొంద గర్భము దాల్చెన్.86
సీ. గర్భితనవసుధాకరపయోనిధిమాడ్కి
                    సతిమేను పాండురచ్ఛవి వహించెఁ
     గలితభృంగాబ్జకుట్మలయుగ్మకముపోల్కిఁ
                    గాంతచన్ముక్కులఁ గప్పు మిగిలె
     మకరందసంవాహమలయానిలునిక్రియ
                    నంబుజాననగతి యలస యయ్యె
     నుచితకాలాగమనోజ్జ్వలకుసుమంబు
                    గతి నింతినాభి వికాస మొందె
ఆ. వళులు విరిసె గౌను బలిసె గోర్కులు మది
     సందడించె నారు నంద మయ్యె
     ననుపమానభాగ్య యగు నన్యమాంబకు
     వర్ణనీయగర్భవైభవమున.87