పుట:దశకుమారచరిత్రము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

దశకుమారచరిత్రము

ఉ. ధీనిధి భాస్కరార్యునకు ధీరగుణాన్వితకొమ్మమాంబకున్
     మానవకోటిలోపల సమస్తగుణములవాఁడు పెద్ద నా
     వానికి వాఁడు పెద్ద యన వానికి వానికి వాఁడు పెద్ద నా
     వానికి వార లిద్దఱకు వాఁ డధికుం డనఁ బుట్టి రాత్మజుల్.33
సీ. వివిధవిద్యాకేళిభవనభావంబున
                    జలజజుముఖచతుష్టయముఁ బోలి
     విబుధవిప్రతిప త్తివిదళనక్రీడమై
                    జలశాయిభుజచతుష్టయముఁ బోలి
     ధర్మమార్గక్రియాదర్శకత్వంబున
                    సన్నుతాగమచతుష్టయముఁ బోలి
     పృథుతరప్రథితగాంభీర్యగుణంబున
                    శంబకాకరచతుష్టయముఁ బోలి
ఆ. సుతచతుష్టయంబు సుతి కెక్కె గుణనిధి
     కేతనయును బారిజాతనిభుఁడు
     మల్లనయును మంత్రిమణి సిద్ధనయు రూప
     కుసుమమార్గణుండు గొమ్మనయును.34
వ. అం దగ్రనందనుండు.35
చ. కవితకు ముఖ్యుఁ డీతఁ డనఁ గామితవస్తువు లిచ్చువాఁడు నా
     నవరసభావకుం డితఁ డనన్ బురుషార్థపరాయణుండు నా
     నవు నన రాజనీతివిషయజ్ఞుఁ డితం డనఁ గీర్తిచంద్రికా
     ధవళితదిక్కుఁ డై నెగడె ధన్యుఁడు కేతనమంత్రి యిమ్మహిన్.36
ఉ. మానిని బ్రహ్మమాంబకు నమాత్యశిఖామణి కేతశౌరికిన్
     భూనుతకీర్తి భాస్కరుఁడు పుణ్యచరిత్రుఁడు మంత్రి గుండడున్

.