పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముందుమాట

ఎంపిక చేసిన మహాత్మాగాంధీరచనల సంపుటిలో “దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర" అను గ్రంధం చేర్చబడినది. అక్కడ వారు జరిపిన "నిశ్చల ప్రతిఘటన" లేక "సత్యాగ్రహం" యొక్క ప్రాముఖ్యత ఇటీవల విశ్వవ్యాప్తంగా పలుచోట్ల జరుగుటయే అందుకు ముఖ్యకారణం గొప్ప అమెరికన్ నీగ్రోనేత డా|| మార్టిన్ లూధర్ కింగ్ మహాత్మా గాంధీ గారి భావాల స్ఫూర్తితో సంపూర్ణంగా ప్రభావితులై, ఆ ప్రేరణతోనే అమెరికాలో పౌరహక్కుల ఉద్యమాన్ని "సత్యాగ్రహ" పంథానే ఆదర్శంగా పెట్టుకొని నడిపించారు చెకోస్లోవేకియాలో ఈ మధ్య జరిగిన ఘట్టాలు “అహింసాత్మక సహాయ నిరాకరణ" "నిశ్చల ప్రతిఘటన" - విదేశీయుల దాడిని కూడ ఎదుర్కొన గలిగిన సశక్తమైన ఆయుధాలు - అనిపింప చేశాయి. పాశ్చాత్య మేధావులనేకులు "సత్యాగ్రహా"న్ని యుద్ధానికి సమానమైన, ఏవిధంగాను తీసిపోని నైతిక ప్రతీకగా అంగీకరిస్తున్నారు

ఆదిలో గాంధీజీ దక్షిణాఫ్రికాలో తన “సత్యాగ్రహ" అనుభవాలను గుజరాతీ భాషలో విపులంగా వ్రాశారు. 1928లో దాని ప్రథమాంగ్లానువాదం వెలువడింది. దీని పునర్ముద్రణ ఎన్నోసార్లు జరిగింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సాగుతున్న అన్యాయాలను వ్యతిరేకించే సశక్త అయుధమైన గాంధేయ సత్యాగ్రహంలో సంపూర్ణ విశ్వాసం గలవారికి ఈ గ్రంధం ఎంతో ఆకర్షకంగా ఉంటుందని భావిస్తున్నాం. ఈ ప్రచురణ ముగింపు ప్రకరణంలో స్వయంగా గాంధీగారే సత్యాగ్రహమనేది ఒక అమూల్యమైన, సాటిలేని మేటి ఆయుధమనీ, దీని ననుసరించిన వారు నిరాశా, పరాజయాలకు ఎన్నటికీ లోనుగారనీ పేర్కొన్నారు

రాజభవన్,

అహ్మదాబాద్,

అక్టోబరు 24, 1968

శ్రీమన్నారాయణ్

iii