పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0116-06 దేసాక్షి సం: 02-096 ఉపమానములు

పల్లవి: నమ్మలేము కానలేము నరులాల మనమింతే
సమ్మతించి యేలేవాఁడు సర్వేశుఁడే సుండీ
    
చ. 1: కంటికిఁ గంటిరెప్ప కాచుకవుండినయట్టు
వొంటి దేహమెల్లా జేవొడ్డుకొన్నట్టు
అంటుక దేహి నేపొద్దు అంతరాత్మయై వుండీ
జంటయై కాచుకున్నాఁడు సర్వేశుఁడే సుండీ
    
చ. 2: చీఁకటి నోటికిఁ గడి చేయే కొంటవచ్చినట్టు
ఆఁకటికి గుక్కిళ్లు ఆసయినట్టు
వీఁకల జంతువులకు వెలుపల లోననుండి
సాఁకుచునున్నాఁ డిదివో సర్వేశుఁడే సుండీ
    
చ. 3: తమదేహ మెంతైనా తానే యింపయి మోచినట్టు
తెమలి ప్రాణ మిన్నిటాఁ దీపయినట్టు
అమరిన భోగమోక్షా లడిగినవారి కిచ్చీ
సముఁడు శ్రీవేంకటాద్రి సర్వేశుఁడే సుండీ