పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0116-03 నాట సం: 02-093 నృసింహ

పల్లవి: దేవశిఖామణి దివిజులు వొగడఁగ
వేవేలు గతులు వెలసీ వాఁడే
    
చ. 1: వీదుల వీదుల వెసఁ దురగముపై
భేదిల బల్లెము బిరబిరఁ దిప్పుచు
మోదముతోడుత మోహనమూరితి
యే దెసచూచిన నేఁగీ వాఁడే
    
చ. 2: కన్నులు దిప్పుచు కర్ణములు గదల
సన్నల రాగెకు చౌకళింపుచును
అన్నిటఁ దేజి యాడఁగ దేవుఁడు
తిన్నఁగ వాగేలు దిప్పీ వాఁడే
    
చ. 3: వలగొనఁ దిరుగుచు వాలము విసరుచు
నిలిచి గుఱ్ఱ మటు నేర్పులు చూపఁగ
బలుశ్రీవేంకటపతి యహోబలపుఁ
బొలమున సారెకుఁ బొదలీ వాఁడే