పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0116-01 సాళంగనాట సం: 02-091 నృసింహ

పల్లవి: విఱిగిరి దానవవీరు లదె
అఱిముఱి దేవత లాడేరదె
    
చ. 1: పరగుకంభ మదె పగిలె పగిలె నదె
హరినరసింహంబాయ నదె
గరుడధ్వజ మదె ఘనచక్రం బదె
మొరసేటి శంకపుమ్రోత లవె
    
చ. 2: వెడలె వెడలె నదె వెనుకొని హిరణ్యుఁ
దొడికిపట్టె నదె తొడమీఁద
విడువక చించిన వేయిచేతులవె
కడపమీఁదనే కదలఁడదె
    
చ. 3: అదె వామాంకంబందు లక్ష్మి యదె
కదిసి శాంతమదే కరుణ యదె
వుదుటున ప్రహ్లాదు నూరడించె నదె
యిదె శ్రీవేంకటమెక్కె నదె