పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0114-04 మాళవిగౌళ సం: 02-082 భక్తి

పల్లవి: నిత్య పూజలివివో నేరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి
    
చ. 1: తనువే గుడియట తలయే శిఖరమట
పెనుహృదయమే హరిపీఠమటా
కనుఁగొను చూపులే ఘనదీపము లట
తనలోపలి యంతర్యామికిని
    
చ. 2: పలుకే మంత్రమట పాదైన నాలికే
కలకలమను పిడిఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలఁపులోపలనున్న దైవమునకు
    
చ. 3: గమనచేష్టలే యంగరంగగతియట
తమిగల జీవుఁడే దాసుఁడట
అమరిన వూర్పులే యాలవట్టములట
క్రమముతో శ్రీవేంకటరాయనికిని