పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0175-05 నాదరామక్రియ సం: 02-373 అంత్యప్రాస

పల్లవి: నేనేమెరిఁగి సేసేనో నీకుఁ దిరువారాధన
ఆని మున్నిటి బ్రహ్మరుద్రాదులు సేయఁగలేరు

చ. 1: అనుగు నీరూప మింతంతనెరిఁగి సేసేనో
వునికై నీ వొక్కచోనే వుండేదెరిఁగి సేసేనో
తనిసి నీకు నొక్కమంత్రమునెరిగిఁ సేసేనో
కనరాని నీమహిమే కడయెరిఁగి సేసేనో

చ. 2: మరిగి నీకు నొక్కనామమునెరిఁగి సేసేనో
అరసి యించుకేకాలమనెరిఁగి సేసేనో
నిరతి నీకేమి లేవని యెరిగి సేసేనో
బెరసి నన్ను గొంత మెప్పించనెరిగి సేసేనో

చ. 3: తెలిసి నీకు నొక్కమూర్తియనెఱిఁగి సేసేనో
అలమిన నీమాయఁ గొంతనెరిఁగి సేసేనో
అలమేల్మంగకుఁ బతియగు శ్రీవేంకటేశుఁడ
వొలసి నీ కుపమింప నొక్క టెరిఁగి సేసేనో