పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0175-03 సాళంగనాట సం: 02-371

పల్లవి: ఈతఁడే యీతఁడే సుండి యెంత యెంచిచూచినా
చేతనే వరాలిచ్చీ శేషాచలేశుఁడు

చ. 1: విశ్వరూపబ్రహ్మము విరాట్టయిన బ్రహ్మము
ఐశ్వర్యస్వరా ట్టాసామ్రాట్టయిన బ్రహ్మము
శాశ్వతబ్రహ్మాండాలు శరీరమైన బ్రహ్మము
యీశ్వరుఁడై మహరాట్టై యిందరిలో బ్రహ్మము

చ. 2: సూర్యునిలో తేజము సోమునిలో తేజము
శౌర్యపు టనలుని భాస్వత్తేజము
కార్యపు టవతారాలఁ గనుఁగొనే తేజము
వీర్యపుటెజ్ఞభాగాల విష్ణునామ తేజము

చ. 3: పరమపురుషమూర్తి ప్రకృతియైన మూర్తి
గరిమతో మహదహంకార మూరితి
ధరఁ బంచతన్మాత్రలు తత్త్వములైన మూరితి
గరుడానంత సేనేశకర్తయైన మూరితి

చ. 4: భాగవతపు దైవము భారతములో దైవము
సాగిన పురాణవేదశాస్త్ర దైవము
పోగులైన బ్రహ్మలను బొడ్డునఁ గన్న దైవము
శ్రీగలిగి భూపతైన శ్రీవేంకటదైవము