పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0174-05 గౌళ సం: 02-366 తేరు

పల్లవి: హరియు సిరియు నేఁగే రదివో తేరు
పరంజ్యోతి స్వరూపపు పైఁడికుండ తేరు

చ. 1: గరుడధ్వజపుఁ దేరు కనకమయపుఁ దేరు
సురలు బొమ్మలైనారు చుట్లఁ దేరు
మెరుఁగుల మేఘముల మించుఁ గొఱిఁగెల తేరు
సిరుల ధ్రువలోకపు శిఖరపుఁ దేరు

చ. 2: బలుకుల పర్వతాలె బండికండ్లైన తేరు
నలుదిక్కు లంచుల వున్నతపుఁ దేరు
కొలదిఁలేని చుక్కలకుచ్చుల ముత్తేల తేరు
మెలుపు నాకాశగంగ మేలుకట్ల తేరు

చ. 3: మునులనే వుత్తమాశ్వములఁగాఁ గట్టిన తేరు
ఘనమహిమలనే సింగారపుఁ దేరు
యెనసి శ్రీవేంకటేశుఁ డెపుఁడూ నలమేల్మంగ
దినదినభోగములఁ దిరమైన తేరు