పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0145-02 గౌళ సం: 02-201 శరణాగతి

పల్లవి: ఒడఁబరుచుకొంటివి వుపేంద్ర నిన్ను నిపుడె
చిడిముడి నీసేవకే సెలవు చేసుకొమ్మీ

చ. 1: కన్నుల నేఁ జూచేదెల్లా కమలాక్ష నీపాదాలే
విన్నవినుకులెల్లా విష్ణుఁడ నీకథలే
తిన్నని నామాటలెల్లా త్రివిక్రమ నీమంత్రాలే
అన్నిటా నాభావము సమర్పణము నీకును

చ. 2: అట్టె నే నడచేవెల్లా హరి నీప్రదక్షిణాలే
గుట్టున నాసేఁతలెల్లా గోవింద నీకైంకర్యాలే
ముట్టి నేభుజించినవి ముకుంద నీప్రసాదాలే
నెట్టన నాభోగమెల్లా నీవసము చేసితి

చ. 3: యిల నేఁ బండఁబడేవి యీశ్వర నీకు మొక్కులే
తలఁచే నాతలఁపెల్లా దామోదర నీధ్యానమె
నలువంక శ్రీవేంకటనాయక నీయనుజ్ఞను
నెలవై నాభవములెల్లా నీసొమ్ము చేసితి