పుట:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0138-06 కేదారగౌళ సం: 02-165 కృష్ణ

పల్లవి: మీరు సాక్షి మీరు సాక్షి మే మేమీ ననలేము
చేరి చూడరమ్మ వీని చెల్లుబడి యమ్మా

చ. 1: పిన్నవాఁడు నిద్ర వోఁగ పెనచి కూఁకటతోడ
పన్ని లేఁగతోఁకఁగూడ బంధించి కట్టె
వున్నతిఁ దొలఁగ వాని వొళ్లెల్లా దోఁగిపోయ
కన్నెలార యీకృష్ణుఁ గంటిరటరమ్మా

చ. 2: లేఁగల నన్నిటి నేము లేవక తొల్లె విడిచె
మూఁగి ఆవులుఁబేయలు మొగిఁ గలయ
అఁగి పట్టఁబోతేను అప్పుడే తా గడె వెట్టి
రాఁగతనాన నున్నాఁడు రాచబలువమ్మా

చ. 3: వారము నేసేమనుచు వడి నింటివార మెల్లా
కూరలు పాశాలు దొంతిఁ గూడఁబెట్టితే
ఆరగించ వేలుపుల అలికి పూసి కుడిపీ
కూరిమి శ్రీవేంకటాద్రి గోవిందుఁ డమ్మా