పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0300-06 దేసాళం సం: 03-583 అధ్యాత్మ

పల్లవి:

ఎవ్వరము నేమి సేసేమేమి గడమలు నీకు
రవ్వగా శరణంటే రక్షించుటింతే

చ. 1:

అందరుఁ జేసిన కర్మములవి నీకు జీవనమై
అంది జీవించేవంటే నదియూఁ గాదు
కొందరు సురల(లు?)తోడై కూడి రాఁగా నసురల-
యిందరి గెలిచేవంటే నిదియూఁ గాదు

చ. 2:

వొకచోటఁ గలవు వేరొక చోట లేవంటే-
నకటా యెంచి చూచిన నదియూఁ గాదు
మొకమిచ్చి వొక గుణమునఁ దిరిగేవంటే
సకలగుణుఁడ వాజాడయుఁ గాదు

చ. 3:

కపట మిదనరాదు కడునవు ననరాదు
వుపమించరాదు వొల్లకుండఁగరాదు
యెపుడును శ్రీవేంకటేశ నీ చిత్తమింతే
విపరీతములు లేవు వెలితీ లేదు