పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/514

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0289-01 సాళంగనాట సం: 03-512 తేరు

పల్లవి:

చూడరో చూడరో నేఁడు సురలార నరులార
దాడివోయి దనుజుల దండించి తా వచ్చె

చ. 1:

వాయు వేగమున వచ్చె వనజాక్షు నరదము
వేయిసూర్యుల ప్రతాపవిభవముతో
చాయల చక్రవాళాద్రి సముద్రాలు దాఁటి వచ్చె
ఆయితమై పైఁడిటెక్కే లవే కానవచ్చె

చ. 2:

మునుకొని మనో వేగమున వచ్చె హరితేరు
తనరారు కోటిచంద్రప్రభలతో
వెనుకొని దిక్కులెల్లా విజయము సేసి వచ్చె
కనకాచలముతో గక్కన సరివచ్చె

చ. 3:

గరుడవేగాన శ్రీవేంకటేశు రథము వచ్చె
మరగిన యల మేలుమంగసిరితో
ధరలోన వీధులేఁగి తన నెలవుకు వచ్చె
పరగ హరిదాసుల పంతములు వచ్చె