పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0284-01 శ్రీరాగం సం: 03-482 శరణాగతి


పల్లవి :

కొలిచినవారి పాలి కొల్లలివివో
యిల నిట్టి దైవమవు యిఁక వేరేకలరా


చ. 1:

యెట్టైన నభయహస్త మెత్తుక కాచుకున్నాఁడ-
వట్టె దాసులఁ గాచేనంటా నీవు
తొట్టిన పాపాలు పోఁదోలు నీ నామమంత్రాలు
జట్టిగా లోకాల వెదచల్లినాఁడవు


చ. 2:

తలఁచినవారికెల్లా ధనధాన్యా లిత్తునంటా
వొలసి శ్రీసతి మోచుకున్నాఁడవు
యిలఁ బావనులఁగా నిందరిఁ జేసేనంటా
నెలమిఁ బాదతీర్థ మేరు చేసినాఁడవు


చ. 3:

పుట్టించ జీవులను భువనము లోపల
గట్టిగ బ్రహ్మను నాభిఁ గన్నాఁడవు
అట్టుగఁ బాలుపడి చుట్టి రక్షకత్వానికే
యిట్టే శ్రీవేంకటాద్రి యెక్కినాఁడవు