పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0282-06 మాళవి సం: 03-475 గురు వందన, నృసింహ


పల్లవి :

నారాయణాచ్యుతానంత నిన్నొకచోట
గోరి వెదకనేల వీరివల్లఁ గంటిఁబో


చ. 1:

సొలసి నీ రూపము శ్రుతులలోఁ జెప్పుఁ గాని
బలిమి నాచార్యుఁడైతేఁ బ్రత్యక్షము
పలికి నీ తీర్థము భావనలందే కాని
అల నీ దాసుల మరచేత నిదివో


చ. 2:

నీ యానతు లెన్నఁడు నేము దెలియము గాని
మా యాచార్యునిమాట మంత్రరాజము
కాయములో నీ వుండేది కడు మఱఁగులు గాని
యీయెడ నీ పరికర మిన్నిటా నున్నదివో


చ. 3:

అరిది నీవందన మొకర్చావతారానఁ గాని
గురుపరంపరనై తేఁ గోట్లాయఁ బో
హరి నిన్ను శ్రీవేంకటాద్రినే చూచితిఁ గాని
పరమున నిహమునఁ బంచి చూపె నతఁడు