పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/449

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు:0278-01 సామంతం సం: 03-447 దశావతారములు


పల్లవి :

సంసారమే మేలు సకలజనులకును
కంసాంతకుని భక్తి గలిగితే మేలు


చ. 1:

వినయపు మాటల విద్య సాధించితే మేలు
తనిసి యప్పులలోన దాఁగకుంటే మేలు
మునుపనే భూమి దన్ను మోచి దించకుంటే మేలు
వెనుకొన్న కోపము విడిచితే మేలు


చ. 2:

కోరి వొకరి నడిగి కొంచపడకుంటే మేలు
సారె సారె జీవులను చంపకుంటే మేలు
భారపుటీడుమలను పడకుండితే మేలు
కారించి తిట్ల కొడిగట్టకుంటే మేలు


చ. 3:

పరకాంతల భంగపరచకుంటే మేలు
దొరకొని కెళవులు దొక్కకుంటే మేలు
అరుదైన శ్రీవేంకటాద్రివిభునిఁ గొల్చి
యిరవై నిశ్చింతుఁడైతే నిన్నిటాను మేలు