పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0207-06 నాట సం: 03-042 శరణాగతి

పల్లవి:

ఎందరైనఁ గలరు నీ కింద్రచంద్రాదిసురలు
అందులో నే నెవ్వఁడ నీ వాదరించే దెట్టో

చ. 1:

పెక్కు బ్రహ్మాండములు నీ పెనురోమకూపములఁ
గిక్కిరిశున్న వందొక కీటమ నేను
చక్కఁగా జీవరాసుల సందడిఁ బడున్నవాఁడ
ఇక్కువ నన్నుఁ దలఁచి యెట్టు మన్నించేవో

చ. 2:

కోటులైన వేదములు కొనాడీ నిన్నందులో నా-
నోటి విన్నపము లొక్క నువ్వుగింజంతే
మాటలు నేరక కొఱవలి వాకిట నుండ
బాటగా నీదయ నాపైఁ బారుటెట్టో

చ. 3:

అచ్చపు నీదాసులు అనంతము వారలకు
రిచ్చల నేనొక పాద రేణువ నింతే
ఇచ్చగించి శ్రీవేంకటేశ నిన్నుఁ దలఁచుక
మచ్చికఁ గాచితి నన్ను మఱవనిదెట్టో