పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0270-01 దేసాళం సం: 03-401 గురు వందన, నృసింహ


పల్లవి :

ఎదురు లేక చరింతురెట్టెనా శ్రీవైష్ణవులు
మదించి నేనుగులకు మట్టు మేర వున్నదా


చ. 1:

భాగీరథిలోనఁ బాపమున్నదా పుణ్య-
భోగపు వేదములలో బొంకులున్నవా
సాగరపుటమృతపు చవిలోఁ జేఁదున్నదా
ఆగతి హరిదాసుల కపరాధ మున్నదా


చ. 1:

ఆకసములోన నెరుసందునున్నదా భూమిఁ
జేకొని రవియెదుటఁ జీఁకటున్నదా
యీకడఁ గామధేనువు కియ్యరానివున్నవా
కైకొన్న ప్రపన్నులను గరిసించ నున్నదా


చ. 1:

హరినామమంత్రములో నౌఁగాము లున్నవా
గురుకృప గలిగియుఁ గొరతున్నదా
సరవి శ్రీవేంకటేశు శరణన్నవారికి
విరసంబు లందులో వెదకఁగఁ గలదా