పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/372

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0264-04 సామంతం సం: 03-370 దశావతారములు


పల్లవి :

ఇతనికంటే మరి దైవముఁ గానము యెక్కడ వెదకిన నితఁడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటి కాధారము దానె


చ. 1:

మది జలధుల నొక దైవము వెదకిన మత్స్యావతారం బితఁడు
అదివో పాతాళమందు వెదకితే నాదికూర్మ మీవిష్ణుఁడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమని కంటిమి
చెదఱక కొండల గుహల వెదకితే శ్రీనరసింహం బున్నాఁడు


చ. 2:

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
బలువీరులలో వెదకి చూచితే పరశురాముఁ డొకఁడై నాఁడు
తలఁపున శివుఁడునుఁ బార్వతి వెదకిన తారకబ్రహ్మము రాఘవుఁడు
కెలఁకుల నావులమందల వెదకిన కృష్ణుఁడు రాముఁడునైనారు.


చ. 3:

పొంచి యసురకాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాఁడు
మించిన కాలము కడపట వెదకిన మీఁదటి కల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన నంతర్యామై మెరసెను
యెంచుక ఇహమునఁ బరమున వెదకిన యీతఁడే శ్రీవేంకటవిభుఁడు