పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0260-06 బౌళి సం: 03-348 శరణాగతి


పల్లవి :

ఎన్నఁడుఁ దీరవు యీ పనులు
పన్నిన నీ మాయ బహుళంబాయ


చ. 1:

పెక్కు మతంబుల పెద్దలు నడచిరి
వొక్క సమ్మతై వొడఁబడరు
పెక్కుదేవతలు పేరు వాడెదరు
తక్కక ఘనులము తామేయనుచు


చ. 1:

పలికెటి చదువులు బహుమార్గంబులు
కలసి యేకవాక్యత గాదు
చ(ఛ?)లవాదంబులు జనులును మానరు
పలు తర్కంబులె పచరించేరు


చ. 1:

శరణాగతులకు శ్రీవేంకటేశ్వర
తిరముగ నీవే తీర్చితివి
పరమవైష్ణవులు పట్టిరి వ్రతము
యిరవుగ నాచార్యు లెరుఁగుదురు