పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0258-04 దేవగాంధారి సం: 03-334 వైరాగ్య చింత


పల్లవి :

ఇంకనైనా రోయరాదా యీపాటీవార మింతే
మంకుఁదనమేల మామాట వినరాదా


చ. 1:

తోలుబొంత గట్టుకొన్నదొర నింతే నన్ను నీవు
కూళసంసారమా యేల కొసరేవు
యీలకొన్న యెముకల ఇంటిలో కాఁపుర మింతే
యేల మాయ వెంటఁబెట్టే వేమి గద్దు నీకును


చ. 2:

పంచభూతపు చుట్టాల బదుకులోవాఁడ నింతే
యెంచ కింద్రియయాచకు లేల వచ్చేరు
కంచపు గాలావటించే కలిమిలోవార మింతే
చంచలపుటాసలు చేయి చాఁచనేఁటికి


చ. 3:

 నెత్తురుజలదుర్గాన నిలిచినవాఁడ నింతే
జొత్తుఁబాపములు యేల చోటడిగేరు
హత్తిన శ్రీవేంకటేశుఁడాత్మలోన నున్నవాఁడు
మత్తపుటజ్ఞానమా మమ్మేమి చూచేవు